16 June, 2026 | 9:42 PM

రేగళ్ల ఎస్సీ కాలనీపై వివక్ష..?

16-06-2026 08:45 PM

డ్రైనేజీ లేక మురుగు నీరు రోడ్లపైకి

అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

లక్ష్మీదేవిపల్లి/కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనుల విషయంలో, తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో డబుల్ రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ ఎస్సీ కాలనీ పరిధిలో సైడ్ డ్రైనేజీ నిర్మాణాన్ని విస్మరించడం వల్ల మురుగు నీరు రోడ్లపైకి చేరి దుర్గంధం వెదజల్లుతోందని ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని వాపోతున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు నేరుగా రోడ్లపైకి చేరుతోంది. దీంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

దుర్వాసన, దోమల బెడదతో పాటు అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండగా, ఎస్సీ కాలనీకి వచ్చేసరికి నిబంధనలు, నిధుల కొరత, సాంకేతిక కారణాలు అంటూ సాకులు చెబుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓట్ల సమయంలో మాత్రమే ఎస్సీ కాలనీ గుర్తుకు వచ్చి, అభివృద్ధి విషయంలో మాత్రం చిన్నచూపు చూస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికే కాలనీలో తాగునీటి సమస్యలు, మౌలిక వసతుల కొరత కొనసాగుతుండగా, ఇప్పుడు డ్రైనేజీ సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది.

ఇటీవల నిర్మించిన మంచినీటి ట్యాంకు కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతోంది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికల్లోనూ రాజకీయ జోక్యం పెరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కల్పించుకొని ఎస్సీ కాలనీలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. లేనిపక్షంలో ఎస్సీ కాలనీ ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు..