29 June, 2026 | 2:54 PM

Breaking News

పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి

15-04-2026 10:23 AM

చండీగఢ్: పంజాబ్‌లోని(Punjab ) ఫతేగఢ్ సాహిబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక బస్సు బోల్తా(Devotees Bus Overturns) పడటంతో కనీసం ఆరుగురు భక్తులు మరణించగా, మరో 21 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బస్సీ పఠానా ప్రాంతంలోని మొరిండా-చున్నీ రహదారిపై ఉన్న హిమ్మత్‌పుర సమీపంలో రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైశాఖీ పర్వదినం సందర్భంగా ఆనందపూర్ సాహిబ్‌లో దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న భక్తులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు.

ప్రయాణికులందరూ ఫతేగఢ్ సాహిబ్‌లోని మైన్ మజ్రి గ్రామానికి చెందినవారే. పోలీసుల ప్రకారం, రహదారిపై వెళ్తుండగా బస్సులో ఏర్పడిన యాంత్రిక లోపం(Mechanical failure) కారణంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా ఆరుగురు మరణించగా, మరో 21 మంది గాయపడ్డారని ఫతేగఢ్ సాహిబ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్ కుమార్ తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.