25 May, 2026 | 1:00 AM

మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

25-05-2026 12:26 AM

కిటకిటలాడిన కొమురవెల్లి

కొమురవెల్లి, మే 24: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం నుంచి మొదలైన భక్తుల రాక ఆదివారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. మల్లన్న సన్నిధానం చేరుకున్న భక్తులు స్వామివారి పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించి, గర్భాలయంలో ఉన్న మూలవిరాట్ ను దర్శించుకున్నారు. మొక్కులో భాగంగా పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు నివేదించి, ఒడి బియ్యం పోసి, తల్లిని భక్తితో వేడుకున్నారు. స్వామివారి దర్శనానికి సు మారు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కృష్ణ తెలిపారు. మల్లికార్జున స్వామి నిత్యాన్నదానానికి ముంబైకి చెందిన మడుపతి మల్లేష్, కవిత దంపతులు తమ తల్లిదండ్రుల పేరు మీద రూ.రెండు లక్షల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.