13 August, 2026 | 10:34 PM

గ్యాస్ సిలిండర్ పేలి ఇండ్లు దగ్ధం

13-08-2026 09:42 PM

- భారీగా ఆస్తి నష్టం 

- ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుల వేడుకోలు 

మహాముత్తారం,(విజయక్రాంతి): ఇల్లు దగ్ధమై భారీ ఆస్తి నష్టం జరిగిన విషాద సంఘటన మండలంలోని ములుగుపల్లి గ్రామపంచాయతీలో గురువారం జరిగింది. ములుగుపల్లి ఉపసర్పంచ్ మండపు లక్ష్మీమల్లు తన ఇద్దరు కుమారులు మోహన్ ప్రభాకర్ లు వేరువేరుగా మూడు కుటుంబాలు రెండు ఇండ్లలో నివాసం ఉంటున్నారు. అందరూ తమ వ్యక్తిగత పనులు నిమిత్తం వెళ్లిన  తరుణంలో ఇంట్లో నుండి ఒకసారిగా గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించడంతో గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ పురుషోత్తం సునీత శ్రీనివాస్ వార్డ్ మెంబర్లు సంఘటన స్థలానికి వెళ్లి పోలీస్ రెవిన్యూ అగ్ని మాపక అధికారులకు సమాచారం అందించారు.అగ్ని మాపక  వాహనం వచ్చేసరికి దాదాపు ఇల్లు 80 శాతం దగ్ధమైంది. విలువైన కాగితాలతో పాటు ఇంట్లో ఉన్న నగదు బంగారం వెండి వంట సామాగ్రి బట్టలు కాళీ బూడిద అయ్యాయి. సుమారుగా 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న తహసిల్దార్ శ్రీనివాస్ పంచనామా నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిపిస్తానని తెలిపారు. తక్షణ సహాయం కింద మూడు కుటుంబాలకు 25 కేజీల చొప్పున 75 కిలోల బియ్యం అందజేశారు.ఏమి చేయని నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలని భాదితులు ప్రభుత్వాన్ని కోరారు.