calender_icon.png 17 February, 2026 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోతేగడ్డకు పోటెత్తిన భక్తజనం

16-02-2026 12:00:00 AM

బూర్గంపాడు, ఫిబ్రవరి15,(విజయక్రాంతి): గోదావరి నదిలో ద్వీపకల్పంలో కొలువుతీరిన మోతే గడ్డ వీరభద్ర స్వామివారిని శివరాత్రి పర్వదినాన దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తున తరలివచ్చారు. ఎంతో ప్రాచీన, ప్రాబల్యం కలిగిన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధికి ఎక్కింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఈ ఆలయానికి చుట్టూ గోదావరి ఉండటంతో పాటు కాకతీయుల నాటి కాలంలో ఈ దేవాలయం కట్టినట్టు ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదిరాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలంలోని మోతే గ్రామ సమీపంలోని గోదావరి తీరం నుంచి పడవల ద్వారా భక్తులు గోదావరి నదిని దాటి... గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు.

అనంతరం మోతే గడ్డ వీరభద్ర స్వామి వారిని దర్శించుకున్నారు.బూర్గంపాడు మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత- రామకొండారెడ్డి దంపతులు, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, తాగునీరు అందజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని చెన్నంపేట గ్రామ సమీపంలోని గోదావరి నదిని దాటి స్వామివారిని దర్శించుకున్నారు.

దీంతో గోదావరి తీరం భక్తులతో సందడి సందడిగా కనిపించింది.తెలంగాణ సరి హద్దు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరావిగూడెంలోని గోదావరి ఒడ్డున ఉన్న పార్వతి సమేత కేదారేశ్వర స్వామివార్ల ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రానికి భక్తులు బారులు తీరారు.

పడవల కొరతతో భక్తులకు ఇబ్బందులు

గోదావరి దాటి మోతేగడ్డ వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు పడవల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అధికారులు సరైన ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు రెండు గంటలుగా గోదావరి ఒడ్డునే నిల్చుని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

వీరభద్రుని దర్శనం కోసం కుటుంబాలతో వచ్చిన మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు వేడెక్కిన ఇసుకపై కష్టాలు పడుతుండగా, సంబంధిత శాఖల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి నెలకొంటున్నప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.