భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి
ప్రిన్సిపల్ బొడిగె విజయ్ కుమార్
చిట్యాల,(విజయక్రాంతి): భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సౌమ్య విద్యామందిర్ పాఠశాల ప్రిన్సిపల్ బొడిగె విజయ్ కుమార్ అన్నారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని సౌమ్య విద్యామందిర్ పాఠశాలలో గురువారం గోరింటాకు వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయినీలు, విద్యార్థినీలు గౌరీదేవి పూజతో పాటు మైదాకు చెట్టు, రోలుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సహజ గోరింటాకు ఆకులను నూరి సంప్రదాయ పాటలు పాడుకుంటూ ఒకరి చేతులకు మరొకరు గోరింటాకు అలంకరించుకుని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గోరింటాకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. సహజ గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుందని తెలిపారు.
ప్రస్తుత కాలంలో రసాయనాలతో తయారయ్యే కోన్ మెహందీలకు బదులుగా సహజ గోరింటాకును ఉపయోగించాలని సూచిస్తూ, విద్యార్థులకు గోరింటాకు విశిష్టత, ఆరోగ్య ప్రయోజనాలు, సాంస్కృతిక ప్రాధాన్యతను వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సంప్రదాయాల పట్ల అవగాహన, అనుబంధాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రుద్రారపు లావణ్య, మునుకుంట్ల వేణు, మునుకుంట్ల స్వాతి, గంధమల్ల చర్విత, రేగులగడ్డ ప్రశాంతి, ఆయా పొలిమేర మంజుల, విద్యార్థులు సూరోజు శ్రీకృష్ణప్రియ, బోగ పవిత్ర, రుద్రారపు ప్రణవి, పిడుగురాళ్ల నేహిత, రొండి కార్తీక్, దంతూరి అఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






