ధోనీ వాటా అడగలేదు

12-09-2026 | 05:10am

స్పష్టత ఇచ్చిన సీఎస్‌కే 

లక్ష షేర్లు కొన్న మాజీ కెప్టెన్ 

చెన్నై, సెప్టెంబర్ 11: చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఫ్రాంచైజీలో పెద్ద ఎత్తున వాటా కొనుగోలు చేయడానికి ధోనీ ప్రయత్నించారనే వార్తలను యాజమాన్యం అధికారికంగా ఖండించింది. ఫ్రాంచైజీలో వాటా కావాలని ధోనీ తమను ఎప్పుడూ అడగలేదని, దీనిపై ఇరు పక్షాల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని సీఎస్‌కే సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.

ఇటీవల ధోనీ సీఎస్‌కేలో 25 శాతం వాటా కోరగా, యాజమాన్యం కేవలం 3 నుండి 5.5 శాతం మాత్రమే ఆఫర్ చేసిందని, అందువల్ల ఇరుపక్షాల మధ్య విభేదాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎ త్తున ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో మెజారిటీ వాటా 55 శాతానికి పైగా ఇప్పటికీ ఎన్. శ్రీనివాసన్ కుటుంబం చేతిలోనే ఉంది.

ఇదిలా ఉంటే సీఎస్‌కేలో భారీ వాటా కోసం అధికారిక చర్చలు జరగకపోయినా, అన్‌లిస్టెడ్ కంపెనీ అయిన సీఎస్‌కేలో ప్రైవేట్ ఆఫ్-మార్కెట్ లావాదేవీల ద్వారా ధోనీ ఇప్పటికే 1 లక్షకు పైగా షేర్లను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఫ్రాంచైజీ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ధోనీ వద్ద ఉన్న ఈ షేర్ల విలువ దాదాపు రూ.2.6 కోట్ల నుంచి రూ.3 కోట్లు వరకు ఉంటుంది. వాటా అంశంపై వస్తున్న రూమర్స్ పక్కన పెడితే, రాబోయే ఐపీఎల్ సీజన్ల వ్యూహాలు, కొత్త హెడ్ కోచ్ ఎంపిక వంటి కీలక నిర్ణయాల్లో ధోనీ కీలకంగా వ్యవహరిస్తున్నాడు.

మరిన్ని వార్తలు