11-02-2026 03:13:46 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీ సు లం.. మీ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ అక్రమ కార్యకలాపాల్లో వినియోగించారు.. మనీ లాండరింగ్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం.. అంటూ సైబర్ నేరగాళ్లు సామాన్యులను హడలెత్తిస్తున్నారు. తాజాగా డిజిటల్ అరెస్ట్ పేరుతో నగరా నికి చెందిన ఓ వృద్ధుడిని భయపెట్టి ఏకంగా రూ. 1.07 కోట్లు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు.
ఈ కేసులో ఢిల్లీకి చెందిన ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్స్ డీసీపీ వి. అరవింద్ బాబు మంగళవారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన 62 ఏళ్ల వ్యక్తికి గత అక్టోబర్‌లో ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి తాము ముంబై పోలీసులమని, సీబీఐ అధికారులమని ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు ఉపయోగించి డ్రగ్స్ రవాణా, మనీ లాండరింగ్ జరుగుతోందని బెదిరించారు. విచారణ పేరుతో వీడియో కాల్ చేసి, బాధితుడిని ఇంట్లోనే నిర్బంధించినట్లు ప్రవర్తించారు.
గంట గంటకూ తమకు రిపోర్ట్ చేయా లని ఆదేశించారు. కేసు నుంచి బయటపడాలంటే మీ ఆస్తులను నగదుగా మార్చి, సుప్రీంకోర్టు వెరిఫికేషన్ కోసం తాము చెప్పిన ఖాతాల్లో జమ చేయాలని నమ్మించారు. దీంతో భయపడిపోయిన బాధితుడు విడతలవారీగా రూ. 1 కోటి 7 లక్షలను నేరగాళ్లఖాతాలకు బదిలీ చేశారు. మోసపోయానని గ్రహించి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో వారు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని హోటళ్లలో ఉంటూ ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
ఢిల్లీకి చెందిన గుర్దీప్ సింగ్ (42), హర్ ప్రీత్ సింగ్ (36), కుమార్ మోహిత్ (30)లను అరెస్ట్ చేశారు. వీరు కమీషన్ ఆశతో ఇతరుల బ్యాంకు ఖాతాలను సేకరించి, బాధితుల నుంచి వచ్చిన డబ్బును వెంటనే ప్రధాన సూత్రధారులకు పంపిస్తున్నట్లు తేలింది. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో గుజరాత్, కేరళ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు లభించాయి.ఈ కేసును ఛేదించడంలో జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పర్యవేక్షణలో ఏసీపీ శివ మారుతి, ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు బృందం కీలక పాత్ర పోషించింది.