11-02-2026 03:13:51 AM
హుజూర్ నగర్ (నేరేడుచర్ల) ఫిబ్రవరి 10: నేరేడుచర్ల మండల పరిధిలోని చిల్లేపల్లి గ్రామంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నల్లగొండ విభాగం మరియు సివిల్ సప్లైస్ శాఖ అధికారులు మంగళవారం సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్,ఎన్ఫోర్స్మెంట్ నల్లగొండ విభాగం సీఐ దశరథ, సివిల్ సప్లైస్ శాఖ రివెన్యూ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కలిసి చిల్లేపల్లి గ్రామంలోని రేషన్ షాప్ నెం. 4015004 వద్ద రేషన్ డీలర్ రవి గుప్తా వద్ద ఉన్న బియ్యం నిల్వలను అధికారులు పరిశీలించారు.
రికార్డ్ ప్రకారం షాపులో 46.96 క్వింటాళ్ల బియ్యం ఉండాల్సి ఉండగా,భౌతికంగా 36.67 క్వింటాళ్ల బియ్యం మాత్రమే లభించాయి.దీంతో 10.29 క్వింటాళ్ల బియ్యం తేడాను అధికారులు గుర్తించారు. దీంతో ఈసీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 6ఎ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.అనంతరం సోమారం, బొడలదిన్న గ్రామాల్లోని రేషన్ దుకాణాలను అధికారులు తనిఖీ చేసి మాట్లాడుతూ...రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి అవకతవకలు సహించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రేషన్ డీలర్లను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.