దేశ విచ్ఛిన్నమే కాంగ్రెస్ లక్ష్యం

10-05-2024 01:40:52 AM

కాంగ్రెస్‌పై ఎంపీ కే లక్ష్మణ్ ఆరోపణలు

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): కులం, భాష పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచే విభజన రాజకీయాలు చేస్తుందని, ఆ పార్టీకి ఇదేమీ కొత్తకాదన్నారు. భారత ప్రతిష్టను దిగజార్చే విధంగా దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాతున్నారని ఆయన ఆరోపించారు.

నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాహుల్‌గాంధీ ప్రధాన సలహాదారుడైన సామ్ పిట్రోడా భారత్‌పై విషపూరిత వ్యాఖ్యలు చేశారని, ఇది జాత్యాహంకారానికి నిదర్శనం అన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ తరఫున రాహుల్, సోనియా, ప్రియాంకగాంధీ ఖండించకపోవడం వారికి దేశం పట్ల ఉన్న గౌరవం ఏంటో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ఆలోచనలు సామ్ పిట్రోడా ప్రజల ముందు పెట్టారన్నారు. పిట్రోడా రాజీనామా కేవలం ఒక డ్రామా అని, పార్టీ నష్ట నివారణ చర్యల మాత్రమే అన్న లక్ష్మణ్.. పిట్రోడాను దేశం నుంచి బహిష్కరించాలని, దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు.

కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ దక్షిణ భారత్ ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తే ఆ పార్టీ ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ కంటే నెహ్రూ కంట్రీబ్యూషన్ ఎక్కువగా ఉందని పిట్రోడా మాట్లాడినా స్పందించలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ రహస్య ఎజెండా ఏమిటో తెలియడం లేదని, ముందు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకుని రేవంత్ మాట్లాడితే  మంచిదని హితవు పలికారు. దేశం సమగ్రత కోసం మోదీకి ఓటు వేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.