బీఆర్‌ఎస్ పాలనలో అన్ని గాలి దీపాలే..!

10-05-2024 02:19:52 AM

కూలిపోయే బ్రిడ్జీలు, కుంగిపోయే ప్రాజెక్టులు!

కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా

బీఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్‌బాబు విమర్శలు

మంథని, మే 9 (విజయక్రాంతి): గాలికి కూలిపోయే వంతెనలు.. కృంగిపోయే ప్రాజెక్టు లు.. బీఆర్‌ఎస్ పాలనలో అన్ని గాలిలో దీపాలుగా మారిపోయాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఘాటుగా విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు లక్ష ఓట్లతో కట్టి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. గురువారం మంథని పరిధి శ్రీపాదకాలనీలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి ప్రచారం చేపట్టారు. లైన్‌గడ్డ, గౌడ్స్ వీధి, సుభాష్‌నగర్, మసీదు వాడ, సూరయ్యపల్లి, ధర్మారం, పుట్ట పాక , రామయ్యపల్లె, సిద్ధిపల్లె, గోపాల్‌పూర్, సింగిరెడ్డి పలె, మైలిపల్ల్లి గ్రామాలకు చెందిన వారు పలువురు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

అనంతరం మంత్రి మాట్లాడు తూ పుట్టిన మూడు నెలలకే ఏ పసిపాప నడవదని, అధికారంలోకి వచ్చి అయిదు నెలలు గడవగానే ఏం చేయలేదనడం బీఆర్‌ఎస్ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలుపుతో నియోజవర్గానికి భారీగా పరిశ్రమలు వస్తాయన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంను అతలాకుతలం చేసిందన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మంథని ప్రాంతానికి ఒక్క చుక్క నీరు కూడా రాలేదని, ఆ ఖర్చుతో రాష్ట్రమంతటా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించవచ్చన్నారు.

గాలి దుమారం వస్తే కూలిపోయే వంతెనలను ఎక్కడైనా చూశారా అంటూ ఎద్దేవా చేశారు. గాలి మోటార్లలో వచ్చి గాలి మాటలు మాట్లాడి వెళ్లేవాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు. రైతుబంధు రాకుండా కుట్ర చేసింది బీజేపీ అని, ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ తప్పకుండా జరుగుతుందన్నారు.

రూ.140 కోట్లతో మంథని వద్ద గోదావరిపై వంతెన నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. శ్రీధర్‌బాబు ఏదీ ఊరికే చెప్పడనీ, చెప్పాడంటే అది చేసి చూపిస్తాడని అన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలతోపాటు రామగుండంను కార్పొరేషన్‌గా చేసింది కూడా తానేనని గుర్తు చేశారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రజలంతా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవి, వైస్ చైర్మన్ శ్రీపద బానయ్య, కౌన్సిలర్లు విజయలక్ష్మిపాపారావు, రమేష్, నాయకులు ముసుకుల సురేందర్‌రెడ్డి, శశిభూషన్‌కాచే, సతీష్, ఒడ్నాల శ్రీను, మోహన్‌శర్మ, ఆకుల కిరణ్, శ్రీనువాస్, రాంభట్ల సంతోషిని, సర్వేష్‌గౌడ్ పాల్గొన్నారు.