కాంగ్రెస్‌లోకి శ్రీకాంతాచారి తల్లి

10-05-2024 01:39:26 AM

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్షీ 

కాంగ్రెస్ 13 సీట్లలో విజయం సాధిస్తుంది 

బీజేపీకి 3, ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తాయి

రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి 

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): తెలంగాణ మలిదశ పోరాటంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి, బీఆర్‌ఎస్ నాయకురాలు శంకరమ్మ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమెతో పాటు నల్లగొండ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని హుజూర్‌నగర్, ఇతర నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాసు మున్షీ, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి తెలం గాణ కోసం తన ప్రాణాలను త్యాగం చేశారని, కానీ ఆ తర్వాత వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఆ కుటుబానికి న్యాయం చేయలేదని విమర్శించారు. శంకరమ్మ చాలా కాలం బీఆర్‌ఎస్‌లో పనిచేసినా కేసీఆర్ పట్టించుకోలేద న్నారు. సమైక్యవాదులకు పార్టీలో, ప్రభుత్వంలో పెద్దపీట వేసిన కేసీఆర్.. ఉద్యమకారులను పక్కనపెట్టారని మంత్రి మండిపడ్డారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. శంకరమ్మ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి తనపై పోటీ చేశారని, అయినా తామెప్పుడు వ్యక్తిగత వైరాలకు వెళ్లలేదన్నారు. 

తడిసిన ధాన్యానికీ మద్దతు ధర..

హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అయిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేసి గెలవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 13, బీజేపీ 3 సీట్లలో, ఎంఐఎం ఒక సీటును గెలుచుకుంటుందని మంత్రి జోష్యం చెప్పారు.  ఎన్నికలు పూర్తవ్వగానే అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని మంత్రి పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవడం లేదని, గతం కంటే ఇప్పుడు నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు సెంటర్ల దగ్గర తడిసిన ధాన్యానికి కూడా ఎంఎస్‌పీ ధర అందిస్తామని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌లో మాకు అన్యాయం జరిగింది : శంకరమ్మ 

బీఆర్‌ఎస్ పార్టీలో తమకు అన్యాయం జరిగిందని శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ అన్నారు. శ్రీకాంతచారి మరణం చూసి సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత.. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజ్మీరా ఆత్మరాంనాయక్ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో తన అనుచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు.  ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన అజ్మీరా అత్మరాంనాయక్ బీజేపీ నుంచి 2019, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సందర్భంగా ఆత్మరావు నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం పాటుపడుతుందని, అందుకే ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేస్తానని తెలిపారు.