‘అనర్హత’ ఒక్కటే సరిపోదు!

26-09-2026 | 05:10am

దానం నాగేందర్(Danam Nagender) 2023లో బీఆర్‌ఎస్ టికెట్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద దాఖలైన పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మార్చి 11, 2026న కొట్టేశారు. కానీ స్పీకర్ ఉత్తర్వును తిరస్కరించి, ఏప్రిల్ 23, 2024 నుంచే అనర్హత వర్తిస్తుందని, ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ ఏర్పడిందని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సభాపతి నిర్ణయాన్ని పక్కకు పెట్టే అధికారం హైకోర్టుకు రాజ్యాంగంలోని  ఆర్టికల్ 226 కింద కల్పించబడింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ తీర్పుననుసరించి ఖైరతాబాద్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగాలి. 

ఫిరాయింపు నిరోధక చట్టం కింద కేవలం సభ్యత్వం మాత్రమే పోతుంది, అనర్హుడుగా ప్రకటింపబడ్డ అభ్యర్థి తిరిగి పోటీ చేసే హక్కు కోల్పోడు. అందుకే దానం నాగేందర్ మళ్ళీ అదే స్థానంలో కాంగ్రెస్ అతనికే టికెట్ ఖరారు చేస్తే ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ గెలిస్తే మంత్రి కూడా కావచ్చు. చట్టం ప్రకారం అది నేరం కాదు. కానీ నైతికంగా అనర్హత వేటుపడిన వ్యక్తి మళ్ళీ వెంటనే పోటీ చేయడం ఎంతవరకు సబబు. అంటే మెజారిటీ ప్రజాతీర్పును తుంగలో తొక్కినందుకు పడే శిక్ష కేవలం సభ్యత్వం కొన్ని నెలల పాటు రద్దు కావటం మాత్రమే.

        భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక రాజకీయ పార్టీ నుంచి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి స్వచ్ఛందంగా పార్టీని వీడి మరో పార్టీలో చేరినా లేదా పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేసినా, స్పీకర్ అతనిపై అనర్హత వేటు వేస్తారు. దీంతో అతని సభ్యత్వం రద్దవుతుంది. అదే చట్టంలోని సెక్షన్లు 8 నుండి 10 కింద ఎన్నికల్లో అవినీతి లేదా ఇతర అవకతవకల నేరారోపణపై చట్టసభకు ఎన్నికైన ఏ అభ్యర్థి అయినా కోర్టు తీర్పు మూలంగా అనర్హతకు గురైతే, ఆ వ్యక్తి ఆరేండ్లపాటు చట్టసభలకు పోటీ చేయకుండా నిషేధం (కూలింగ్ పీరియడ్) ఉంటుంది, కానీ లక్షలాది మంది ఓటర్ల విశ్వాసాన్ని వమ్ము చేసి వారి తీర్పును అమ్ముకున్న ఫిరాయింపుదారుడికి తిరిగి పోటీ చేయకుండా ఎలాంటి నిషేధం లేకపోవటం ఏ కోశానా సబ బుకాదు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951తో పోలిస్తే ఫిరాయింపు దారుడిని కేవలం సభ్యత్వం మాత్రమే కోల్పోయినట్లు ప్రకటించటం ఒక పెద్ద లొసుగు. పైగా మెజారిటీ ప్రజల తీర్పును అపహాస్యం చేసినట్లే. ఈ లోపాన్ని సరిదిద్దాలంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.పి. జీవన్‌రెడ్డి భారత లా కమిషన్ చైర్మన్‌గా ఎన్నికల సంస్కరణలపై అత్యంత సమగ్రమైన నివేదికను మే 1999లో సమర్పించారు. ఫిరాయింపు కారణంగా అనర్హతకు గురైన వ్యక్తిని ఆ సభ పదవీకాలం ముగిసే వరకు లేదా ఆరేళ్లపాటు పోటీ చేయ కుండా, ఏ పదవి చేపట్టకుండా నిషేధించాలి.

ఫిరాయింపు కేసులను స్పీకర్ నిర్ణయించడం పక్షపాతానికి దారితీస్తుంది. కాబట్టి ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి/గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి,లేదా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో స్వతంత్ర ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. ఫిరాయింపు ద్వారా లబ్ధి పొందకుండా, అనర్హతకు గురైన వ్యక్తి మిగిలిన పదవీకాలం వరకు మంత్రి పదవి చేపట్టకుండా నిషేధించాలని స్పష్టంగా చెప్పింది. ఫిరాయింపు నిరోధక చట్టం కేవలం సభ్యత్వాన్ని రద్దు చేసే చట్టంగా కాకుండా, నిజంగా ఫిరాయింపును నిరోధించే చట్టంగా మారాలంటే ఈ సవరణలు అత్యవస రం. అప్పుడే ప్రజాస్వామ్యంలో ఓటుకు, ప్రజా తీర్పుకు విలువ పెరుగుతుంది.

 విశ్రాంత జిల్లా జడ్జి, 9848545970

తడకమళ్ళ మురళీధర్,

మరిన్ని వార్తలు