కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం
ప్రజాప్రభుత్వంలోనే రైతులకు మేలు
పెద్దపల్లిలో రోటోవేటర్లు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలను పంపిణిలో ఎమ్మెల్యే విజయరమణా రావు
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రికరణ పనిముట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి నియోజకవర్గంలోని రైతులకు మొత్తం 103 యూనిట్లకు గాను 1 కోటి 11 లక్షల రూపాయల విలువ గల సబ్సిడీతో 63 మంది లబ్ధిదారులైన రైతులకు రోటోవేటర్లు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలను ఎమ్మెల్యే విజయరమణా రావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.కోటి 11 లక్షల సబ్సిడీతో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను పంపిణీ చేయడం జరుగుతుందని, రాబోవు రోజుల్లో రైతులకు ఇబ్బంది రాకుండా అనుభవాన్ని రంగరించి కార్యక్రమాలు నడిపిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని బందు పెట్టి పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు వ్యవసాయ యాంత్రికరణ పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
రైతులు నానో యూరియా, నానో డిఏపి, నానో పొటాష్ వాడాలని సూచించారు. అలాగే కేజీ వీల్స్ ట్రాక్టర్లతో రోడ్లు నాశనం అవుతున్నాయని, కేజీ వీల్స్ కు పట్టీలు పెట్టుకోవాలని సూచించారు. రోడ్డుపై కేజీ వీల్స్ తో నడిచే ట్రాక్టర్లకు మొదటిసారి రూ.5 వేలు, రెండవసారి రూ.పది వేలు జరిమాన, మూడవసారి కేసు నమోదు చేయడం, బండిని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, డిఏఓ శ్రీనివాస్, ఏడీఏ శ్రీనాథ్, మార్కెట్ చైర్మన్లు,పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఏఓలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




