25 May, 2026 | 12:54 PM

పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు

25-05-2026 12:09 PM
  1. రైతులకు జీలుగ విత్తనాలు పంపిణి..
  2. నేను రైతు పక్షపాతిని రైతులకు కష్టం నష్టం కలుగనివ్వను..
  3. ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు..
  4. రైతులు వరి కొయ్యలను కాల్చకండి..
  5. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణ రావు

సుల్తానాబాద్, మే 25 (విజయక్రాంతి): పంట భూముల సారాన్ని పెంచేందుకు సేంద్రియ ఎరువులు వినియోగం మేలు అని, ఇందుకోసం తమ ప్రభుత్వం రైతులకు జీలుగు విత్తనాలను 50 శాతం రాయితీపై అందిస్తుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు, సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సింగిల్ విండో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వం రైతులకు  50 శాతం రాయితీపై అందజేసే జానుము, జీలుగ విత్తనాలను స్థానిక నాయకులతో కలిసి విజయరమణ రావు పంపిణీ చేశారు, ముందుగా సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, అధికారులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావు కు  పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికి, సన్మానించారు.

ఈ సందర్బంగావిజయరమణ రావు  మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు. సేంద్రియ ఎరువుల వాడకంతో పెట్టుబడి తగ్గి దిగుబడి ఎక్కువగా రావడం వల్ల రైతులు ఎక్కువ లాభాలు పొంద వచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించి సాగులో యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు..గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి రైతుల ధాన్యంలో కోతలు పెట్టి నట్టేటముంచిన వారే ఈరోజు నీతులు పలుకుతున్నారని విమర్శించారు.

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వారి ధాన్యం కొనుగోలు క్వింటలకు 10 నుండి 15 కిలోల వరకు కోతలు విధించి వారి నడ్డి విరిచిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వనీదేనని అన్నారు. ప్రజాప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కటింగ్ లేకుండా అన్నదాతలకు అండగా ఉంటున్నాము అని అన్నారు. తడిసిన రంగు మారిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు ఎవ్వరూ వరి కొయ్యలను కాల్చకూడదని కోరారు. వరి కొయ్యలను కాల్చడం ద్వారా భూసారం తగ్గిపోతుందని,అగ్ని ప్రమాదాలకు గురవ్వడం జరుగుతుందని దానిని మానుకోవాలని రైతులను కోరారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు,మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరీ మహేందర్, దామోదర్ రావు, చిలుక సతీష్ , పన్నాల రాములు, అమిరీశెట్టి తిరుపతి,మోబిన్ , ఫహీం, మహిళ రైతు నాయకురాలు బండ మాధవి , డైరెక్టర్లు, మండల వ్యవసాయ అధికారి పైడితల్లి, సింగిల్ విండో సీఈఓ బూర్గు సంతోష్, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు  పాల్గొన్నారు.