దోమకొండలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
దోమకొండ, ఆగస్టు 26 (విజయక్రాంతి): దోమకొండ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఐరేని నర్సయ్య ఆధ్వర్యంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఐరేని నర్సయ్య మాట్లాడుతూ పేద కుటుంబాలకు ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తోందన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు రేషన్ సరుకులు మరింత సులభంగా, పారదర్శకంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామంలోని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు.
కొత్తగా అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు వాటర్ప్రూఫ్తో పాటు సుమారు తొమ్మిది ప్రత్యేక భద్రతా ఫీచర్లను కలిగి ఉన్నాయని తెలిపారు. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, గ్రామపంచాయతీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ గోపాల్రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, అబ్రబోయిన రాజేందర్, షమ్మీ, జీపీఓ అశోక్, వార్డు సభ్యులు, రేషన్ షాప్ డీలర్లు, స్థానికులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






