ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు
కల్వకుర్తి,: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం మీదుగా వెళ్లే జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మించిన ఫుట్‌పాత్‌లను సమీప వ్యాపారులు ఆక్రమించి తమ అవసరాలకు వినియోగించుకోవడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా బారికేడ్లు తొలగించి నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా పాదచారులు రోడ్డుపైనే నడవాల్సి వస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో
జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ అధికారులు పలుమార్లు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో గురువారం పోలీసులు, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా జేసీబీ యంత్రంతో రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించారు. ఎన్నాళ్లకో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించడంతో పాదచారులకు మేలు జరగనుందని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవరకొండ రోడ్డులోని వాసవి కమాన్ నుంచి మహబూబ్‌నగర్ మార్గంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల వరకు రహదారికి ఇరువైపులా ఉన్న అన్ని ఆక్రమణలను పూర్తిగా తొలగించి, ఫుట్‌పాత్‌లను పాదచారుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో పట్టణానికి నూతన శోభ రావడంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.






