సోదర ప్రేమకు చిహ్నం రాఖీ బంధం
ఘట్ కేసర్, ఆగస్టు 27 (విజయక్రాంతి): అమ్మలోని ఆప్యాయత, నాన్నలోని ప్రేమ, స్నేహంలోని మాధర్యాన్ని సుఖదుఃఖాలలో ఆదరాభిమానాలను, అనురాగాన్ని అందించేదే సోదరభావం. అక్కా తమ్ముళ్ల, అన్నా చెల్లెళ్ల ప్రేమానురాగాల బంధానికి ప్రతీక రాఖీ పండగ. ప్రతియేటా శ్రావణమాసంలోని పౌర్ణమి రోజున మనదేశంలోని ప్రజలందరూ ఈవేడుకను జరుపుకుంటారు. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాల మధ్య ఈపండగను జరుపుకుంటారు.
ఇది కేవలం మనదేశంలోనే కనిపించే ఒక అరుదైన దృష్యం. రాఖీ పండగ వచ్చిందంటే చాలు మహిళలందరూ తమ సోదరుల కోసం రకరకాల రాఖీలు కొంటూ పండగకు రెండు, మూడు రోజుల ముందు నుండే షాపింగ్ చేస్తూ బిజీబిజీగా కనిపిస్తారు. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు ఎంతదూరంలో ఉన్నా ఈ పర్వదినం రోజున ఒక చోటుకి చేరుకుని ఈ వేడుక జరుపుకుంటారు.
తమ మధ్య సోదర భావం, ప్రేమ, అనురాగం, మమకారం కలకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ రక్షా బంధన్ వేడుకలు జరుపుకుంటారు . ఒకప్పుడు కేవలం దూది, దారం, స్పాంజీ, పూసలు వంటి వాటితో తయ్యారు చేసిన రాఖీలు మాత్రమే లభ్యమయ్యేవి . కాని నేడు పెరిగిపోయిన ఆధునిక పద్ధత లకు అనుగుణంగా విభిన్న కొత్తకొత్త డిజైన్లు వెరైటీలతో ముచ్చట గొలిపే రాఖీలు నేడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవే గాక వెండి, బంగారం, ప్లాంటీనంలతో వివిధ డిజైన్లలో రాఖీలను తయ్యారు చేసి దుకాణాల వారు విక్రయానికి సిద్ధంగా ఉంచారు.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రక్షాబంధన్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం మన దేశంలోనే కనిపిస్తుంది . అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను పురస్కరించుకొని ఘట్కేసర్ పట్టణ కేంధ్రంలోని మార్కెట్లలో రంగురంగుల రాఖీలు కనువిందు చేస్తున్నాయి. పట్టణంలోని పలుచోట్ల రాఖీ విక్రయ కేంధ్రాలు వెలిశాయి. శుక్రవారం రాఖీపండగ ఉండటంతో రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి.
ప్రపంచంలోని ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు, ఆత్మీయతకు, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధిచెందిన దేశంగా భారతదేశంలో రాఖీపండగ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఈ పండగ సందర్బంగా దగ్గరలో ఉన్న సహోదరిలే కాక దూరప్రాంతాలలో ఉన్న అక్కా, చెల్లెళ్లు కూడా తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు బయలుదేరి రావడం ఆనవాయితీగా వస్తుంది. దేశవ్యాప్తంగా పండగను ఘనంగా జరుపుకుంటారు.






