13 April, 2026 | 7:28 PM

రెండో విడతలో 84.15 శాతం పోలింగ్ నమోదు

14-12-2025 06:16 PM

రెండవ దశ పోలింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..

పెద్దపల్లి (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, పెద్దపల్లి జిల్లాలో రెండవ విడత 84.15 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ధర్మారం మండలంలోని దొంగతుర్తి, మేడారం, వ్యవసాయ మార్కెట్ యార్డ్, ధర్మారం, జడ్పీహెచ్ఎస్ ధర్మారం, పాలకుర్తి మండలంలోని కుక్కల గూడూరు, ఈసాల తక్కలపల్లి, పాలకుర్తి, జడ్పీహెచ్ఎస్ లోని బసంత్ నగర్ లోని పోలింగ్ కేంద్రాలను, అంతర్గాం మండలంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల ఆన్లైన్ ప్రక్రియను తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లాలో రెండవ విడత ఎన్నికలు జరుగుతున్న 4 మండలాల పరిధిలో 84.15శాతం వరకు పోలింగ్ నమోదైందని, 94 వేల 807 మంది ఓటర్లు తమ ఓటు హక్కు పంచాయతీ ఎన్నికల్లో వినియోగించుకున్నారని తెలిపారు. రిసెప్షన్ కౌంటర్ లో ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎంపీడీవోలకు సూచించారు. ఎన్నికల రిపోర్టింగ్ సకాలంలో అందించాలని, వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో నరేందర్, పెద్దపల్లి ఆర్డిఓ బి.గంగయ్య, తాహసిల్దార్లు శ్రీనివాస్, సునీత, ఎంపీడీవోలు ప్రవీణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.