3 May, 2026 | 7:42 AM

పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి

12-03-2026 04:49 PM

కలెక్టర్ కె. హరిత

ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ గురుకుల పాఠశాల/కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కె. హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఆమె, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు తావు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రం వద్ద త్రాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఫిజిక్స్ ఫ్యాకల్టీ అధ్యాపకుడు సంజీవ్ రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.