30 July, 2026 | 1:02 PM

వాగులు దాటొద్దు.. ప్రాణాలతో చెలగాటం వద్దు.. కలెక్టర్ హెచ్చరిక

30-07-2026 12:28 PM

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. హరిత హెచ్చరిక

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు దాటే సాహసం చేయవద్దని జిల్లా కలెక్టర్ కె. హరిత హెచ్చరించారు.గురువారం ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుతో పాటు అలూరి సమీపంలోని ఆర్‌అండ్‌బీ వాగు వరద ప్రవాహాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని తెలిపారు.

వ్యవసాయదారులు, పశువుల కాపరులు, ప్రజలు వరద నీటిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉధృత ప్రవాహం ఉన్న వాగులు, వంతెనలు, అల్పస్థాయి కల్వర్టుల వద్ద రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు శాఖల సిబ్బందిని మోహరించి, ఎవరినీ దాటేందుకు అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు.గుండి వాగు వద్ద లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న వరద నీటిని పరిశీలించిన కలెక్టర్, అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 8500844365 నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ఈ పర్యటనలో రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.