30 July, 2026 | 1:10 PM

వర్ష పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి వివేక్

30-07-2026 12:26 PM

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : జిల్లాలో కురుస్తున్న వర్ష పరిస్థితులలో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి(Minister Vivek Venkataswamy) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కోటపల్లిలో ఇంటి గోడ కూలిన ఘటనలో గాయాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, ఆర్ఎంఓలు భీష్మ, శ్రీధర్, కోటపల్లి మండల తహసిల్దార్ రాఘవేంద్ర లతో కలిసి పరామర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కోటపల్లి మండలం ఆలుగాం గ్రామానికి చెందిన ఆత్రం మాంతయ్య ఇంటి గోడ కూలి ఇంటిలో ఉన్న ఆత్రం లక్ష్మి తలకు, ఆత్రం అనిల్ చేతికి గాయాలై మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని, పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుత వర్ష పరిస్థితులలో ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వర్షాల కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. చెన్నూర్ నియోజక వర్గ పరిధిలోని చెన్నూర్, క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపల్ కమిషనర్లకు తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా సంరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.