14 March, 2026 | 4:20 AM

4 వేల కోట్లు దారి మళ్లింపు!

14-03-2026 01:36 AM
  1. గాంధీ సరోవర్ పేరిట పేదల ఇళ్లను కూల్చవద్దు
  2. మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): మూసీ ప్రాజెక్టుపై బీజేపీకి వ్యతిరేకత లేదు.. కానీ పేదల ఇళ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తు న్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు స్పష్టం చేశారు. లీగల్‌గా కట్టుకున్న ఇండ్లను కూల్చుతున్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపాలన్నారు. గాంధీ సరోవర్ ప్రాజక్టు పేరుతో రూ. 4 వేల కోట్లు దారి మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు.

మూసీపై ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం పట్ల బీజేపీకి ఎలాంటి అభ్యంతరంలేదని స్పష్టంచేశారు. మూసీ నది పునరుజ్జీవాన్ని గానీ, మూసీ ప్రాజెక్టునుగానీ బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించ లేదన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూసీ నది హైదరాబాద్ నగరం నుంచి కృష్ణానదిలో కలిసే వరకు పరిశుభ్రంగా ఉండాలని, అందులో స్వచ్ఛమైన నీరు ప్రవహించాలని, ఆ నీరు రైతులకు సాగునీటిగా ఉపయోగపడాలని బీజేపీ స్పష్టంగా కోరుకుంటోందని తెలిపారు.

అయితే ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయ డం సరికాదన్నారు. ‘గాంధీ సరోవర్’ పేరు తో అక్కడ నివసిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చడం అంగీకారయోగ్యం కాదన్నారు. మధుపార్క్ రిడ్జ్, వి ఘ్నేశ్వర్ కాలనీ వంటి ప్రాంతాల్లో చట్టబద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చాల్సిన అవ సరం లేదని, ఆ ఇళ్లను కూల్చకుండా కూడా మూసీని శుద్ధి చేయవచ్చునని రాంచందర్‌రావు అన్నారు. 

సబర్మతి గురించి తెలుసుకోండి..

సబర్మతి నదిని ఉదాహరణగా చెబుతూ మాట్లాడేవారు అసలు అక్కడ ప్రాజెక్టు ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఒకప్పుడు సబర్మతి కూడా మూసీలా కాలుష్యంతో, దుర్వాసనతో ఉండేదని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు నర్మదా నది నుంచి నీటిని సబర్మతికి మళ్లించి, నదుల అనుసంధానం చేసి, ముందుగా నది శుభ్రపరిచారని చెప్పారు.

అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలను ముందుగా పునరావాసం కల్పించి, ప్రత్యామ్నాయ గృహాలు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు. సుమారు 4 వేల కుటుంబాలకు ప్రత్యామ్నాయ గృహాలు ఇచ్చిన తర్వాతే అభివృద్ధి పనులు చేపట్టారని, ప్రజల జీవితం దెబ్బతినకుండా జరిగేదే నిజమైన అభివృద్ధి అన్నారు. మధుబన్ పార్క్, విఘ్నేశ్వర్ కాలనీ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను నిరాశ్రయులను చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లు కూల్చడం అన్యాయం అన్నారు.

ఒక్క ఇల్లు కూడా దెబ్బతినకుండా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. గాంధీ విగ్రహం నిర్మించాలనుకుంటే వెయ్యి అడుగులైనా, రెండువేల అడుగులైనా ఆకాశాన్ని తాకేలా నిర్మించొచ్చని, దానికి బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కానీ పేదల ఇళ్లు కూల్చి వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తే మాత్రం బీజేపీ తప్పకుండా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. ముందుగా మూసీని శుద్ధిచేసి, ఆ తర్వాత అభివృద్ధి పనులు చేప ట్టాలని, దానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. 

దేశంలో గ్యాస్, ఆయిల్, డీజిల్, పెట్రోల్ దొరకవని ప్రజల్లో భయం సృష్టించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రపంచంలో యుద్ధాలు, ఉద్రిక్తతలు ఉన్నప్పుడు వాటి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంపైనా కనిపించవచ్చని, కానీ అదే పేరుతో దేశంలో కొరత వస్తుందని భయాందోళనలు సృష్టించడం సరికాదన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని రాంచందర్‌రావు చెప్పారు.

కేంద్ర మంత్రి జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీ సంబంధిత దేశాల నాయకులతో మాట్లాడి, భారతదేశానికి రావాల్సిన చమురు, గ్యాస్ సరఫరాలు హోర్ముజ్ జలసంధి ద్వారా అంతరాయం లేకుండా దేశానికి చేరేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. భారతదేశం ఒకే ప్రాంతంపై ఆధారపడదని, దాదాపు 40 శాతం ముడిచమురు ఇతర దేశాల నుంచే వస్తోందని చెప్పారు. దేశంలో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ కొరత ఉండదన్నారు. యుద్ధ పరిస్థితుల వల్ల రవాణాలో స్వల్ప ఆలస్యం జరగవచ్చునని, కానీ ఇంధన కొరత మాత్రం ఉండదని స్పష్టం చేశారు.