1 March, 2026 | 4:33 AM

విజయ్‌తో విడాకులు ఇప్పించండి

28-02-2026 12:02 AM

కోర్టును ఆశ్రయించిన సతీమణి సంగీత

చెన్నై, ఫిబ్రవరి 27: తమిళ సినీనటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత సోర్నలింగం విజయ్ చెంగల్‌పట్టు కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయ, సినీవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ భార్య సంగీత సోర్నలింగం విడాకులు కోరుతూ చెంగల్‌పట్టులోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివాహ జీవితం సజావుగా కొనసాగడం లేదని, వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ పిటిషన్‌ను స్వీకరించగా.. ఏప్రిల్ 20వ తేదీన కోర్టుకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే విజయ్, సంగీత వివాహం 1999లో జరిగింది. సంగీత లండన్‌కు చెందిన తమిళ కుటుంబానికి చెందినవారు.

విజయ్ నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఆయన అభిమానిగా సంగీత పరిచయం అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే, పెళ్లున కొంతకాలం తర్వాతే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమైనట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారని సినీవర్గాల్లో ప్రచారం ఉంది. ప్రత్యేకంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత జీవితంలో మార్పులు వచ్చాయని కొందరు విశ్లేషిస్తున్నారు.

ఈ విడాకుల వివాదం ఇప్పుడు తమిళనాడు రాజకీయ, సినీవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోపక్క విజయ్, సినీనటి త్రిషకు మధ్య సంబంధం ఉందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల తమిళనాడుకు చెందిన కొందరు రాజకీయ నేతలు సైతం ఇవే కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించడం.. ఆ తర్వాత ఆ నేతలు క్షమాపణలు చెప్పడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఇంతలో సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో.. విజయ్, - త్రిష మధ్య రిలేషన్ ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.