3 August, 2026 | 3:40 AM

ఆస్తి ఉన్నా హక్కు డౌటే!

03-08-2026 02:39 AM
  1. 22ఏ ఉచ్చులో హైదరాబాద్ ఆస్తులు
  2. నిషేధిత జాబితాలోకి  70 వేల ఇళ్లు, ప్లాట్లు
  3. నోటీసులు ఇవ్వకుండానే రెవెన్యూ నిర్ణయం
  4. యూఎల్‌సీ, జీ సర్కారీ పేరుతో ఆంక్షలు
  5. అవసరానికి అమ్ముకోలేని పరిస్థితి
  6. యజమానుల్లో ఆందోళన 
  7. రాష్ట్ర రాజధానిలో మందగించిన రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో మీకు ఇల్లు ఉందా? సొంత ఫ్లాట్‌పై ధీమాగా ఉన్నా రా? ఓపెన్ ప్లాట్ చూసుకొని మురిసిపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే మీ ఆస్తి మీ పేరు మీదే ఉండకపోవచ్చు! నిషేధిత జాబితాలోకి చేరిపోవచ్చు! ప్రస్తు తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకొన్న గందరగోళం ఇదే. ఇండ్లు, ప్లాట్లు 22 జాబితాలోకి చేరుతున్నాయన్న సమాచారంతో ఆస్తిదారులు ఆందోళన చెందు తుతున్నారు. కష్టపడి కొనుగోలు చేసిన ఆస్తి ఎప్పుడు ఏ జాబితాలోకి వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ఏ ఇల్లు అసలైన యజమాని పేరు మీద ఉందో? ఏ ఆస్తి ప్రభుత్వ భూమిగా మారిందో?  ఏ ఆస్తిపై నిషేధపు ముద్ర పడిందో తెలియడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 70 వేల ఆస్తులను రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రజ లు కష్టార్జితం, అన్ని అనుమతులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఎలాంటి నోటీసులు, ప్రకటనలు లేకుండానే 22ఏ(1)(డీ)లోని యూఎల్సీ, జీ సర్కారీ పేరిట చేర్చినట్లు తెలుస్తోంది.

ఇవే ఆకకుండా మరికొన్ని ఇండ్లు, నిర్మాణాలను 22ఏ(1)ఏ, బీ, సీ విభాగాల్లో నూ నమోదు చేసినట్లు సమాచారం. తమ ఆస్తులు నిషేధిత జాబితాల్లోకి వెళ్లడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర అవసరాలకు ఇల్లు, స్థలం లేదా ప్లాట్ అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం లీజ్ డీడ్‌కు కూడా అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. తాజా పరిణామాలతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లపై తీవ్ర ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. నిషేధిత జాబితాలో చేర్చిన ఆస్తుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. 

50 ఏళ్ల నాటి ఇండ్లు కూడా..

50 ఏళ్ల క్రితం స్థలాలను సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసి, వెంచర్లు, సొసైటీల ద్వారా నిర్మించుకున్న ఇండ్లు ఇప్పుడు నిషేధిత జాబితాలో దర్శనమిస్తున్నాయి.  సనత్‌నగర్,  యూసుఫ్‌గూడ్, బంజారాహిల్స్, ఫిల్‌మనగర్, ఎమ్మెల్యే కాలనీ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, జూబ్లీహిల్స్, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లోని వేలాది ఇండ్లను 22ఏ(1)(డీ)లో చేర్చినట్టు తెలుస్తోంది.

ఆయా ప్రాంతాల ప్రజలు అత్యవసరం నిమిత్తం ఇండ్లు అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలనాకి వెళ్లే నిషేధిత జాబితాలో ఉన్నట్లు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 70 వరకు ఇండ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నట్లు వెలుగుచూడగా, నగరవ్యాప్తంగా ఎన్ని ఉన్నా యోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టరేట్‌కు బాధితుల క్యూ..

కూలినాలికి వెళ్లి పైసాపైసా కూడబెట్టి, ఉద్యోగాలు చేసి, లోన్లు తీసుకొని కొనుగోలు చేసిన ప్లాట్లు, కట్టుకున్న ఇండ్లు నిషేధిత జాబితాలో చేరడం, అధికారులు నోటీసులు కూడా ఇవ్వకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పత్రాలు, అనుమతులున్న తమ ఆస్తులు ప్రొబేషనరీ, జీ సర్కారీ జాబితాలోకి ఎలా వెళ్తాయని ప్రశ్నిస్తున్నారు. ప్లాట్లు, ఇండ్లు అమ్ముకుందామన్నా, ఎవరికైనా లీజ్‌కుఎ ఇద్దామన్నా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో అమయోమంలో ఉన్నారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదిస్తే నిషేధిత జాబితాలో ఉన్నదని, రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదని బదులిస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం తమకు సంబంధించినది కాదని, కలెక్టర్ పరిధిలో ఉన్నదంటూ సమాధానమి స్తున్నారని వాపోతున్నారు. చేసేది లేక బాధితులు కలెక్టర్‌కు క్యూ కడుతున్నారు. ప్రజా వాణిలో వందలాదిగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిర్యాదులను స్వీకరిస్తున్న అధికా రులు, సరైన సమాధానం చెప్పడం లేదని, తమ ఆస్తులపై నిషేధం తొలిగించాలని వారు కోరుతున్నారు.