ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
గ్రామపంచాయతీ సిబ్బందికి సబ్కలెక్టర్ సూచన
అశ్వాపురం, మే 19 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్యాలయాలకు వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు సిబ్బంది సకాలంలో స్పందించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని భద్రాచలం సబ్కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సూచించారు. మంగళవారం అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు, మొండికుంట గ్రామపంచాయతీ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కార్యాలయ రికార్డులు, ఫైళ్ల నిర్వహణను పరిశీలించారు.
కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు, రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని, ప్రజలు తమ సమస్యలను గ్రామ సర్పంచుల వద్దకు తీసుకువస్తారని, సర్పంచులు మరియు సిబ్బంది సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయాలకు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలను సిబ్బంది మర్యాదపూర్వకంగా పలకరించి, వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ముఖ్యంగా భూమి సమస్యలు, రెవెన్యూ పట్టాల సిఫార్సులు, గిరిజన రైతులకు సంబంధించిన ఇతర సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా స్పష్టంగా తెలియజేయాలని, సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






