30 July, 2026 | 3:02 PM

వదలని జడివాన.. స్తంభించిన ప్రజాజీవనం

30-07-2026 02:31 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విస్తారంగా కురుస్తున్న వర్షంతో ప్రజాజీవనం స్తంభించిపోయింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బెల్లంపల్లి, తాండూరు కాసిపేట, నేన్నెల,భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో వర్షం కారణంగా వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. వాగులు, వంకలు వరద నీరుతో పొంగిపొర్లుతున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని జాతి కుంట చెరువు వరద నీరుతో నిండిపోయింది. సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ దావస్వాతి ప్రజలను హెచ్చరించారు.

ఈ మేరకు చైర్పర్సన్ దావస్వాతి జాతికుంట చెరువును సందర్శించారు. పట్టణంలోని ప్రధాన రోడ్లు జలమయంగా మారాయి. రాంనగర్ బ్రిడ్జి, కాలువ వరద నీరుచేరి పొంగి పారుతుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాల్టెక్సు, రైల్వేస్టేషన్ ప్రాంతంలో వరద నీరు జనావాసాల్లోకి చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. 13,17, 18, వార్డుల్లో వరద లోతట్టు ప్రాంతాల్లో పాలు గృహాల్లోకి వర్షం నీరు చేరి ప్రజలు తీవ్ర అసౌకర్యంలో కాలంగడుపుతున్నారు. పూరి గుడిసెలు తడిసి ముద్దయ్యాయి. వరద బాధిత కుటుంబాలకు ఆయా వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు అండగా నిలిచారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో13 వార్డులో వరద నీరు ఇళ్లకు చేరిన బాధితులకు వార్డు కౌన్సిలర్ రాజ్ కుమార్ మూడు రోజులకు సరిపడు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అదేవిధంగా 17వ వార్డులో వర్షానికి తడిసి పలు గృహాలు కూలిపోయాయి. ఘటన స్థలాన్నీ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ సందర్శించారు. రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి, మునిసిపల్,పోలీసు అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ,  ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.