30 July, 2026 | 3:17 PM

గోదావరికి కొత్త కళ... మంథనిలో తొణికిసలాడుతున్న ఆనందం

30-07-2026 02:37 PM

ఎడారిని తలపించిన తీరాన పరవళ్లు తొక్కుతున్న గంగమ్మ..

చిగురించిన రైతన్న ఆశలు

మంథని,(విజయక్రాంతి): గత రెండు నెలలుగా సరైన వర్షాలు లేక, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గోదావరి తల్లి మళ్లీ రూపుమార్చుకుంది. నిన్నమొన్నటి వరకు నీళ్లు లేక ఎడారిలా వెలవెలబోయిన గోదావరి తీరం, ఇప్పుడు తుఫాన్ ప్రభావం కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నిండుకుండలా మారడంతో మంథని ప్రాంతమంతా పండగ వాతావరణం సంతరించుకుంది. పరవళ్లు తొక్కుతున్న ప్రకృతి సోయగంతో రైతులు, ప్రజలు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ఎగువన పడుతున్న వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి అందాలు చూసేందుకు స్థానికులు నదీ తీరానికి క్యూ కడుతున్నారు.

అలల సవ్వడులు, ఉరకలేస్తున్న వరద నీటితో నదీ తీరం కనువిందు చేస్తోంది. నదికి మళ్లీ పూర్వవైభవం రావడంతో ప్రకృతి ప్రేమికులు, మంథని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈ ప్రాంత వ్యవసాయ రంగానికి పెద్ద ఊరట లభించింది. నీటి కొరత తీరడంతో వరితో పాటు ఇతర పంటలు సమృద్ధిగా పండుతాయని రైతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి, రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తప్పుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.