3 August, 2026 | 9:27 PM

ఓటరు జాబితా సవరణలో నిర్లక్ష్యం వద్దు

03-08-2026 08:51 PM

వీడియో కాన్ఫరెన్స్ లో సీఈఓ సుదర్శన్ రెడ్డి

భూపాలపల్లి,(విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ... ఎన్యూమరేషన్ ఫారాల్లో లోపాలు, అసంపూర్ణ వివరాలు, తప్పు ఫొటోలు వంటి పొరపాట్లు గమనించామని తెలిపారు. ఇలాంటి తప్పిదాలకు బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ప్రతి ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి వివరాలతో నమోదు చేయాలని సూచించారు. ఐడిఓసి కార్యాలయం నుంచి పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ... జిల్లాలో డిజిటలైజేషన్ 99.55 శాతం పూర్తయిందని తెలిపారు. 1200 మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆర్డిఓకు సూచించారు. ఆబ్సెంట్, షిఫ్ట్, డూప్లికేట్, మరణించిన ఓటర్ల వివరాలపై సంబంధిత ఫారాలను సక్రమంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఆర్డిఓ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.