వరి కొయ్యలను తగలబెట్టకండి
పసరా ఎస్ ఐ తాజుద్దీన్
ములుగు (మహబూబాబాద్) మే 19 (విజయక్రాంతి):పంట పొలాలలో వరి గడ్డి తగలబెట్టడం వల్ల నష్టాలతోపాటు, అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయని, రైతులు వరి కొయ్యలను దగ్ధం చేయడం వీడనాడాలని పసర ఎస్ ఐ తాజుద్దీన్ కోరారు. వరి కొయ్యలను కాల్చి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పంట పొలాల్లో వరి కోత పూర్తయిన అనంతరం మిగిలిపోయిన వరి గడ్డిని తగలబెట్టడం తో అనేక నష్టాలు సంభవిస్తాయినీ తెలిపారు.
గోవిందరావుపేట మండలoలో మంగళవారం పలువురి రైతుల పంట పొలాలను సందర్శించారు. రైతులతో మాట్లాడుతూ పంట పొలంలో వరి గడ్డి తగల పెట్టడంతో జరిగే ప్రమాదాలు రైతుల కు వివరించి, అవగాహన కల్పించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణానికి, భూసారానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోందని వ్యవసాయ తెలిపారు. వరి గడ్డిని కాల్చివేయడం వల్ల భూమిలో ఉండే సహజ సేంద్రియ పదార్థాలు, సూక్ష్మజీవులు నశించి నేల సారం తగ్గిపోతుంది.
దీంతో తదుపరి పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా పొలాల్లో ఉండే పురుగులకు మేలు చేసే జీవులు కూడా అగ్నికి ఆహుతి అవుతాయి.గడ్డి తగలబెట్టడం వల్ల భారీగా పొగ వ్యాపించి వాయు కాలుష్యం పెరుగుతుందన్నారు. పొగ కారణంగా శ్వాసకోశ సమస్యలు, కంటి సమస్యలు, అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు ప్రజల్లో పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు. అలాగే అగ్ని అదుపు తప్పి సమీపంలోని ఇతర పంట పొలాలు, చెట్లు, విద్యుత్ తీగలు దగ్ధమవుతున్నాయని పేర్కొన్నారు. వరి గడ్డిని కాల్చివేయకుండా పశువుల మేతగా, సేంద్రియ ఎరువుల తయారీలో, బయో కంపోస్ట్ కోసం వినియోగించుకోవాలని కోరారు.






