SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి
బిజినేపల్లి, జూన్ 22: ఓటరు జాబితా సవరణల్లో ఎలాంటి తప్పులు జరగకుండా ఏస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో సురేష్ సూచించారు. సోమవారం బిజినేపల్లి మండల కేంద్రంలో రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), రెవెన్యూ అధికారులకు ఏస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనుమానాస్పద ఓటర్లకు నోటీసులు జారీ చేసి, సరైన ధృవీకరణ పత్రాల ఆధారంగానే సవరణలు చేపట్టాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్లు, బీఎల్‌ఓలు సమన్వయంతో పనిచేసి ఓటరు జాబితాను ఖచ్చితంగా రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు సవరణలపై ఏజెంట్లు, బీఎల్‌ఓలకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎండీ మున్నీరుద్దీన్, డిప్యూటీ తహశీల్దార్ రవికుమార్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.






