కూలీ బిడ్డకు డాక్టరేట్
- పేపర్ బాయ్ టూ డాక్టరేట్ వరకు..
- పేదరికాన్ని జయించి, ఉస్మానియా నుంచి పీహెచ్డీ
- రిజర్వేషన్లపై పరిశోధన చేసిన పాల్వాయి నగేష్
తుంగతుర్తి, సెప్టెంబర్ 10: పేదరికం.. కుటుంబ బాధ్యతలు.. కూలీ పనులు.. పేపర్లు వేసిన రోజులు.. మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటం.. ఇవేవీ ఆయన లక్ష్యానికి అడ్డుకాలేదు. తెల్లవారుజామున పేపర్బాయ్గా పనిచేస్తూనే చదువు(Education)ను కొనసాగించారు. భవన నిర్మాణ పనులకు, క్యాటరింగ్ పనులకు వెళ్లినా పుస్తకాన్ని మాత్రం వదల్లేదు.
ఉద్యమాల్లో పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నా వెనక్కి తగ్గలేదు. ఉద్యోగ అవకాశం వచ్చినా ప్రజా ఉద్యమానికే ప్రాధాన్యం ఇచ్చారు. పేదరికం నుంచి మొదలైన ఈ ప్రస్థానం.. నేడు ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకునే స్థాయికి చే రాడు తుంగతుర్తికి చెందిన డా. పాల్వాయి నగేష్.
చిన్నతనం నుంచే చదువులో మేటి
తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పాల్వాయి ఎల్లయ్య రమనర్సమ్మల కుమారు డైన పాల్వాయి నగేష్ చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ కనబరిచారు. ఏడో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన అప్పటి జిల్లా కలెక్టర్ మనోహర ప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు.
ప్రతిభకు అండగా విద్యాసంస్థలు
ఆయన ప్రతిభను గుర్తించిన తుంగతుర్తిలోని విద్యారణ్య పబ్లిక్ స్కూల్ యాజమాన్యం పదో తరగతి వరకు ఉచిత విద్య అందించింది. పదో తరగతిలోనూ మండల స్థాయిలో టాప్ ర్యాంకర్లలో నిలిచారు.నగేష్ ప్రతిభను గుర్తించిన సూర్యాపేటలోని భవిత జూనియర్ కాలేజీ యాజమాన్యం రెండేళ్లపాటు ఉచిత విద్యతో పాటు భోజన వసతి కల్పించింది. ఇంటర్ బైపీసీలో 85 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో తండ్రి పాల్వాయి ఎల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో కుటుంబ భారం మొత్తం నగ్పే పడింది. ఆర్థిక పరిస్థితులు మరింత దయనీయంగా మారాయి. ఎంసెట్లో మంచి ర్యాంకు వచ్చినా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే స్థోమత లేక కౌన్సెలింగ్ కేంద్రం నుంచే వెనుదిరగాల్సి వచ్చింది.
పొద్దున్నే పేపర్లు.. పగలంతా పనులు
చదువును కొనసాగించడంతో పాటు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు తెల్లవారుజామున పేపర్బాయ్గా పనిచేశారు. భవన నిర్మాణ రంగంలో మేస్త్రీ పనులు చేశారు. క్యాటరింగ్ పనులకు వెళ్లారు. కష్టాలు ఎన్ని ఎదురైనా చదువుపై మాత్రం రాజీపడలేదు.
ఓయూలో అడుగు.. ఉద్యమంలో దూకుడు
ఉన్నత చదువుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరి ఎంఏ సోషియాలజీ పూర్తి చేశారు. ఓయూలో అడుగుపెట్టిన నాటి నుంచే మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మిలియన్ మార్చ్, సాగరహారం వంటి ఉద్యమాల్లో విద్యార్థులను సమీకరించారు. పోలీసుల లాఠీ దెబ్బలు, కేసులను ఎదుర్కొన్నారు.
ఉద్యోగం కంటే ఉద్యమమే.. మిన్న
2012లో ఎస్‌ఐ ఉద్యోగ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసాడు. అయితే ఫిజికల్ ఈవెంట్స్కు ముందు ఓయూ ఆరట్స్ కాలేజీ ఎదుట విద్యార్థి సాయికుమార్ ఆత్మబలిదానం చేసుకున్నారు. అనంతరం జరిగిన ర్యాలీ ఉద్రిక్తతల్లో పోలీసుల దాడిలో నగేష్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మరుసటి రోజు జరగాల్సిన ఫిజికల్ ఈవెంట్స్కు చివరి అవకాశం కావడంతో హాజరు కాలేక ఉద్యోగావకాశాన్ని కోల్పోయారు. ఆ సమయంలో ‘ఉద్యోగం నా ఒక్క కుటుంబం కోసమే.. ఉద్యమం యావత్ తెలంగాణప్రజల కోసం’ అనే భావనతో ప్రభుత్వ ఉద్యోగం కంటే ప్రజా పోరాటాలే ప్రాధాన్యం అని నమ్మి నాటి నుండి నేటి వరకు ఒక్క ఉద్యోగానికి అప్లైకేషన్ కూడా పెట్టలే.
తెలంగాణ దళిత, బహుజన హక్కుల కోసం పోరాటం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన పోరాటం కొనసాగించారు. దళితులు, బహుజనులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే విద్యే కీలకమని చెబుతూ వివిధ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో కీలక పాత్ర పోషించారు. 2017లో మాదిగ నవనిర్మాణ సమితిని స్థాపించి పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. మందకృష్ణ మాదిగ అరెస్టును నిరసిస్తూ ఆయన విడుదల కోసం పాదయాత్ర చేపట్టారు.
రిజర్వేషన్‌లపై పరిశోధన
ప్రజా ఉద్యమాలతో పాటు విద్యను కూడా కొనసాగించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగంలో పీహెచ్డీలో చేరారు. ‘భారతదేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ’ అనే అంశంపై సుదీర్ఘంగా పరిశోధన చేసి పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది.
నేడు ‘డాక్టర్’గా కొత్త మైలురాయి
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెప్టెంబరు 8న నిర్వహించిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ముఖ్యఅతిథిగా పాల్గొనగ, భారత్ బయోటిక్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఏం ఎల్ల వైస్ ఛాన్స్ లర్ కుమార్ మొలగరం చేతుల మీదుగా పాల్వాయి నగేష్ కు అధికారికంగా పీహెచ్డీ పట్టాను అందించారు. దీంతో ఆయనను అందరూ అభినందిస్తున్నారు.