సిండి‘కేట్’.. సప‘రేట్’!?
- బ్రాండ్ @ బెల్ట్ షాప్ అధిక ధరలు
- గల్లీకి నాలుగు చొప్పున బెల్ట్ షాపులు
- మానుకోటలో మద్యం షాపుల సిండికేట్ హవా
- స్టిక్కర్లతో ప్రత్యేక అమ్మకాలు
మహబూబాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో అనేక మండలాల్లో బ్రాండ్ షాపుల యజమానులు(Owners of brand name shops) సిండి‘కేట్’(Syndicate) గా మారి మద్యం అమ్మకాలకు సప‘రేట్’ దారిని ఎంచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలాల్లో మద్యం అమ్మకాల(Liquor sales) కోసం లైసెన్స్(License) పొందిన మద్యం షాపుల యజమానులు(Liquor shop owners) కూటమికట్టి బ్రాండెడ్ మద్యాన్ని(Branded liquor) పూర్తిగా బెల్ట్ షాపులకు(Belt shops) తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ప్రత్యేకంగా మండలాల్లో హోల్సేల్ షాపును ఏర్పాటు చేసి ఇందుకోసం ప్రత్యేకంగా స్టిక్కర్లు(Stickers) వేసిన మద్యాన్ని మాత్రమే తమ మండలంలో విక్రయించేలా ప్రత్యేకంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఫలితంగా బ్రాండెడ్ మద్యం లేదంటే బీర్లు కావాల్సిన మద్యం ప్రియులు బెల్ట్ షాపుకు వెళ్లాల్సిన పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో దాదాపు అంతట నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మార్పీకి మించి అదనంగా క్వార్టర్ నుంచి మొదలుకొని ఫుల్ బాటిల్ వరకు 40 రూపాయల నుంచి 200 వరకు అదనంగా బెల్ట్ షాపుల్లో మద్యం ప్రియులను దోచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
మద్యం షాపుల నిర్వాహకులు తమ గ్రాండ్ షాపు పరిధిలో ఉన్న గ్రామాల్లో అధికారికంగా బెల్ట్ షాపులను నిర్వహిస్తూ, ఎలాంటి దాడులు, నియంత్రణ ఉండదని అభయమిస్తూ, క్వార్టర్ బాటిల్ కు 20 రూపాయలు చొప్పున, ఫుల్ బాటిల్ కు 80 రూపాయల వరకు విక్రయిస్తూ, బ్రాండెడ్, బీర్లకు మరికొంత అదనంగా వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇలా బెల్ట్ షాపుల నిర్వాహకులు తాము తెచ్చిన మద్యం సీసాల పై అదనంగా మరికొంత కలిపి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.
ప్రత్యేకంగా స్టిక్కర్లు
మండలాలు, బ్రాండీ షాపుల పరిధిలో బెల్ట్ షాపుల్లో తమ మద్యం మాత్రమే విక్రయించేలా ప్రత్యేకంగా స్టిక్కర్లు ముద్రించి అతికిస్తున్నారు. ఎప్పుడైనా తనిఖీ చేస్తే ఆ స్టిక్కర్లు లేని మద్యం లభిస్తే వారిపై ఎక్సైజ్ శాఖ ద్వారా కేసులు నమోదు చేయిస్తున్నారు. ఎక్కడైనా ఇతర ప్రాంతాల నుండి మద్యం తెచ్చి విక్రయిస్తే ఆ బెల్ట్ షాపుల నిర్వాహకులను ముప్పతిప్పలు పెడుతున్నారు. నర్సింహులపేట ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.
ప్రత్యేక బ్రాండ్లు, బీర్లు బెల్ట్ షాపుల్లోనే!
లైసెన్స్ మద్యం షాపుల్లో కేవలం మామూలు రకాలే విక్రయిస్తున్నారని, బ్రాండెడ్, బీర్లు బెల్ట్ షాపుల్లో నే లభిస్తాయని, బ్రీవరైజస్ కార్పొరేషన్ నుండి దిగుమతి చేసుకున్న వెంటనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న హోల్ సేల్ షాప్ కు తరలిస్తారని ప్రచారం సాగుతోంది. అలా అక్కడి నుండి స్టిక్కర్లు వేసిన తర్వాత బ్రాండెడ్ సరుకంతా బెల్ట్ షాపులకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
‘మామూలు’గా చూస్తున్న అధికారులు
మద్యం షాపుల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా హోల్సేల్ షాపు ఏర్పాటు చేసుకోవడం, బెల్ట్ షాపులో గల్లీకి నాలుగు చొప్పున ఏర్పాటు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం తదితర అంశాలపై అధికారులు ‘మామూలు’గా చూస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మండలాల వారిగా షాపుల యజమానులు ఏర్పాటు చేసుకున్న సిండికేట్ దందా కను సన్నల్లోనే మద్యం విక్రయాలు ఇష్టానుసారంగా సాగుతున్నాయని, అమ్మ కాల టార్గెట్ కోసం అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా అనధికారిక బార్లు, బెల్ట్ షాపులో విచ్చలవిడిగా నిర్వహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.