ధరణి, భూభారతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?

17-09-2026 | 05:40am

భూ లావాదేవీలపై సమగ్ర విచారణకు మేం సిద్ధం  

రేవంత్ ఆస్తులపైనా దర్యాప్తునకు కాంగ్రెస్ ఓకేనా?

సీఎం కుటుంబం పేరిట 308 ఎకరాలు.. ఆధారాలతో నిరూపిస్తాం

నాకు అఫిడవిట్‌కు మించి ఒక్క గుంట ఎక్కువ లేదు  

నా బంధువుల దగ్గర ఉన్న ప్రతి రూపాయి వైట్ మనీయే

22 ఏ అంశంపై ప్రజల్లోనే చర్చిద్దాం: మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ధరణి(Dharani), భూభారతి(Bhubharati), 22ఏ అంశా లతో పాటు గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో  జరిగిన భూ లావాదేవీలన్నింటిపైనా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి(Sitting Judge of the Supreme Court)తో సమగ్ర విచారణ జరిపించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు(Harish Rao) డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్(Congress, BRS) ప్రభుత్వాల హయాంలో జరిగిన భూ లావాదేవీల(Land transaction)పై సమగ్ర విచారణ(Comprehensive inquiry)కు తాము సిద్ధమని, ప్రభుత్వం కూడా ఇందుకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన భూముల పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

సీఎం రేవంత్‌రెడ్డి గత పదేళ్లలో, ముఖ్యం గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సంపాదించిన ఆస్తులపై  విచార ణకు సిద్ధమా అని హరీశ్‌రావు సవాల్ చేశారు. రేవంత్‌రెడ్డి కుటుంబం, ఆయన కూతురు, తమ్ముళ్ల పేరుతో 308 భూములు ఉన్నాయని, తమ వద్ద  ఆధారాలు ఉన్నాయని  పేర్కొన్నారు. ఒక్క కొట్రాలోనే 300 ఎకరాల భూములు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారని, అందులో 175 ఎకరాలకు సంబంధించి పక్కా డాక్యుమెంట్‌లు తమ దగ్గర ఉన్నాయని వెల్లడించారు. 

కొండారెడ్డిపల్లిలో 79 ఎకరాలు, అఫిడవిట్ ప్రకారం మరో 54 ఎకరాలు.. మొత్తం కలిపి 308 ఎకరాలు రేవంత్‌రెడ్డి కుటుంబం పేరిట ఉన్న ది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడి యా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. ‘నాకున్న వ్యవసాయ భూములు వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్‌లో, ఆదా య పన్ను రిటర్న్స్‌లో స్పష్టంగా పొందుపర్చానని, అందులో ఒక్క గుంట భూమి కూడా అదనంగా లేదు.

మా బంధువు లు చట్టబద్ధంగా కంపెనీ షేర్లు కొనుగోలు చేస్తే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారి వద్ద ఉన్న ప్రతి రూపాయీ వైట్ మనీయే’ అని హరీశ్‌రావు  స్పష్టం చేశారు. ‘మా బంధువులు 30 ఏళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో, 2010 నుంచి పౌల్ట్రీ వ్యాపారంలో ఉన్నారు. వారు చట్టబద్ధంగా 2019లో ‘రాజ్ బ్రీడర్స్’ అనే కంపెనీ షేర్లను బ్యాంకు చెక్కుల ద్వారా వైట్ మనీతో కొనుగోలు చేశారు. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవు’ అని తేల్చి చెప్పారు. 

బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తుంటే సీఎం డైవర్షన్ రాజకీయాలు..

ప్రజా సమస్యలు, ఆరు గ్యారెంటీల అమలు, రైతులు, విద్యార్థులు, మహిళల సమస్యలపై బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కుట్రపూరితంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో బీఆర్‌ఎస్ చేసిన ఆరోపణలు నిజమేనని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారని పేర్కొన్నారు.

గతంలో 3.71 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండగా, ప్రస్తుతం 30 లక్షల ఎకరాలకు పెరిగిందని ముఖ్యమంత్రే చెప్పారని పేర్కొన్నారు. కలెక్టర్లు పెద్ద సంఖ్యలో భూములను నిషేధిత జాబితాలో అప్‌లోడ్ చేశారని సీఎం చెబుతున్నప్పుడు, తప్పు చేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఎకరా కూడా 22ఏ జాబితాలో చేర్చలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెబుతున్నారని, అదే సమయంలో అధికారులు 30 లక్షల ఎకరాలను అప్‌లోడ్ చేశారని సీఎం చెబుతున్నారని.. ఇందులో ఎవరి మాట నిజమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

1999 నాటి పాత జాబితాలను కలెక్టర్లు అప్‌లోడ్ చేయడం, ప్రభుత్వం గతంలో విక్రయించిన హెచ్‌ఎండీఏ, యూఎల్‌సీ భూములు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో సమస్య తలెత్తిందని సీఎం స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఇంటికి సంబంధించిన భూమి రాత్రికి రాత్రే 22ఏ జాబితా నుంచి తొలగించారని, అదే విధంగా సామాన్య ప్రజల భూములను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. చట్టం సామాన్యుడికైనా, ముఖ్యమంత్రికైనా ఒకటే ఉండాలన్నారు. భూభారతి వ్యవహారంలో జనగామలో జరిగిన ‘ఛాలెంజ్ క్యాంప్’ స్కామ్ వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని హరీశ్‌రావు ఆరోపించారు.

భూభారతిలో 9,200 ఎకరాలకు పైగా   భూముల రిజిస్ట్రేషన్లు యజమానులకు తెలియకుండానే జరిగాయని మండిపడ్డారు.గజ్వేల్‌లో క్యాన్సర్ చికిత్స పొందుతున్న మహిళ భూమి ఆమెకు తెలియకుండానే బదిలీ అయిందని, నాదర్‌గుల్‌లో రూ.10 వేల కోట్ల భూ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను బీఆర్‌ఎస్ బయటపెట్టిందని.. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. సీఎం కుటుంబ సభ్యుల భూములు, కంపెనీలకు భూముల కేటాయింపులపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ప్రజా సమస్యలపై నిలదీస్తే వ్యక్తిగత విమర్శలా?

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సీఎం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. విద్యుత్ సమస్యలతో రైతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2,500, విద్యార్థులకు భరోసా కార్డు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. లోక్‌సభలో టీషర్టులు, స్టిక్కర్లతో రావడాన్ని ప్రశ్నించకుండా అసెంబ్లీలో మాత్రం నిబంధనల పేరుతో బీఆర్‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. 

మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గొంతు నొక్కారని, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని.. ఈ వ్యవహారంపై తాము సభలోనే ప్రశ్నించేందుకు ప్రయత్నించగా సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సెషన్షన్ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని.. కేసీఆర్‌కు 1,000 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందని గతంలో ఆరోపించిన వారే  ఇప్పుడు 67 ఎకరాలు అంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆస్తులపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు వెల్లడించాలన్నారు.

22ఏ నిషేధిత భూముల సమస్యపై కమిటీ ఏర్పాటు చేస్తామని, మార్గదర్శకాలు రూపొందిస్తామంటూ కాలయాపన చేయకుండా తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి ప్రజలు తెలంగాణ భవన్‌కు వచ్చి తమ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. సీఎం, మంత్రులు తనతో కలిసి ప్రజల మధ్యకు వస్తే 22ఏ నిషేధిత భూముల సమస్యను ఎవరు సృష్టించారో అక్కడే చర్చిద్దామని సవాల్ చేశారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు