లెక్క తేల్చుతాం!
ధరణిని అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ సర్కార్
లక్ష కోట్ల భూ దోపిడీ
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 388 ఎకరాల అసైన్డ్ భూమి
30 రోజుల్లో విచారణ జరపాలని అధికారులకు ఆదేశం
ఆ భూమిని స్వాధీనం చేసుకుని..
శుద్ధిచేసిన చోటే దళితులకు పంచుతాం
కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరిట
9 జిల్లాల్లో.. 439 ఎకరాల భూమి
22 ఏ సమస్యల పరిష్కారానికి వారంలోపు వ్యవస్థ
ఫారెస్టు నుంచి 106 ఎకరాలు మాజీ ఎమ్మెల్యే గండ్రకు బదిలీ
మైహోమ్ రామేశ్వర్‌రావు భూముల్లో అసైన్డ్ స్థలాలు
22 ఏపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ధరణి పేరుతో కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు(Kalvakuntla Chandrashekar Rao), ఆయన కుటుంబ సభ్యులతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు(BRS leaders) భూ కుంభకోణానికి(Land scam) పాల్పడ్డారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆరోపించారు. రూ. లక్ష కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేసి, ఇష్టానుసారంగా తమ పేర్లపైన బదిలీచేసుకున్నారని సీఎం ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ 700 ఎకరాల్లో ఉంటే.. అందులో 388 ఎకరాల అసైన్డ్ భూమి అని, ఈ విషయం కేసీఆర్ ఎందు కు చెప్పలేదని రేవంత్‌రెడ్డి నిలదీశారు.
భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. దళితులు నడిచారని పసుపు నీళ్లతో శుద్ధిచేసిన చోటే, దళితులకు భూములిచ్చి యజమానులను చేస్తామని ప్రకటించారు. 800 మంది దళితులకు ఒక్కొక్క రికి అర ఎకరం చొప్పున పంపిణి చేస్తామని తెలిపారు. గతంలో నాయకులు, ప్రజలు.. ప్రజాసమస్యల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసి సర్వంకోల్పోతే.. కేసీఆర్ మాత్రం తెలంగాణ ఉద్యమం ముసుగులో రూ. వేల కోట్లు అక్రమంగా సంపాదించుకున్నారని సీఎం విమర్శించారు.
22 ఏ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్న అసైన్డ్ భూము లపై విచారణకు ఆదేశిస్తున్నట్లు, 30 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికాలకు సీఎం ఆదేశించారు. ‘సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో కేసీఆర్, ఆయన సతీమణి శోభ పేరిట 67.5 ఎకరాలు ఉంది. కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు , కేటీఆర్ సతీమణి శైలిమ పేరు పేరిట 17.5 ఎకరాలు, పిల్లలు ఆలేఖ్య పేరిటి 9.38 ఎకరాలు, హిమాన్షు పేరిట 46.26 ఎకరాలున్నాయి.
హరీష్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కల్వకుంట్ల కవిత కుటుంబానికి 37 ఎకరాలు ఉంది. జోగినపల్లి సంతోష్‌రావు కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్‌రావుకు 52 ఎకరా లు, కొండల్‌రావుకు 48 ఎకరాలు ఉన్నా యి. ఇలా కేసీఆర్ కుటుంబానికి మొత్తం 9 జిల్లాలోని 24 మండలాల్లో 31 గ్రామా ల్లో 439 ఎకరాలున్నాయి. ఇన్ని ఎకరాలు ఏ వ్యాపారం చేసి సంపాదించారు’ అని సీఎం నిలదీశారు. ఒక కుటుంబానికి కుష్కి భూమి 54 ఎకరాలు, తరి పొలమైతే 27ఎకరాలుండాలని నిబంధన లుండగా. కేసీఆర్‌కు కుటుంబానికి ఉన్నది అంతా తరి పొలమేనని తెలిపారు.
స్పెషల్ ఎంక్వయిరీ టీమ్ ఏర్పాటు..
బీఆర్‌ఎస్ హయాంలోని భూకుంభకోణంపై స్పెషల్ ఎంక్వయిరీ టీమ్ (ఎస్ ఈటీ), వేసి నెలరోజుల్లో భూకుంభకోణం నిగ్గు తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తప్పుచేసిన వారు సభకు రాకుండా తప్పించుకుందామనే చూస్తారని సీఎం ఎద్దేవా చేశారు. పట్టుకుని రమ్మని ఆదేశాలిస్తే తప్ప కేసీఆర్ సభకు వచ్చేటట్టు లేరని విమర్శించారు. కాళేశ్వరంతో ఆర్థిక దోపిడి పూర్తయ్యాక.. భూములను ఎట్లా కొల్లగొట్టాలని కేసీఆర్ ఆలోచన చేశారని, ఈ క్రమంలోనే ఆయన మెదడులో ధరణి అనే పురుగు మొలిచిందన్నారు.
అదే ఈరోజు భూతమై తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తోందన్నారు. ధరణి మెదడును రంగరించి తానే కనిపెట్టాను అని ప్రారంభం రోజు గొప్పగా చెప్పుకున్నారని, అదంతా పచ్చి అబద్ధంమని సీఎం పేర్కొన్నారు. ధరణి వ్యవస్థ 2010లో ఒడిశాలో మొదలైందని, 2014లో దానిని ధరణిపై కాగ్ తీవ్రంగా ఆక్షేపించిందన్నారు. 2018లో ధరణి కాంట్రాక్టును ఐఎల్‌ఎఫ్‌ఎస్ దక్కించుకుందని వివరించారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్, ధరణిని టెరాసిస్ అనే కంపెనీకి అమ్ముకుందని విమర్శించారు. టెరాసిస్ కంపెనీలో శ్రీధరరాజుకు వాటా ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఎందుకు రద్దు చేశారు..
రెవెన్యూ సమాచారం కేంద్ర సంస్థ ఎన్‌ఐసీకి ఇవ్వకుండా ప్రైవేటు సంస్థకు ఎందుకు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని సీఎం ప్రశ్నించారు. రూ. 110 కోట్ల విలువైన కాంట్రాక్టు రూ. 1,400 కోట్ల వాల్యూకు ఎలా వచ్చిందని, దీనిపై విచారణ చేయాల్సిన అవసరం లేదా? అని సీఎం ప్రశ్నించారు. 1982లో వచ్చిన భూకబ్జా నిరోధక చట్టాన్ని తెలంగాణ ఏర్పాటు కాగానే కేసీఆర్ రద్దు చేశారని గుర్తు చేశారు. ఆ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారో కేసీఆర్ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణకు చెందిన 2.5కోట్ల ఎకరాల భూమి డేటా మాఫియా చేతికి వెళ్లిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు చెందిన భూముల సంపూర్ణ సమాచారాన్ని మాఫియా చేతికి ఇచ్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సభలో ఉన్నప్పుడే 22 ఏ బండారం బయటపెట్టాలని భావించానని తెలిపారు. ఆ విషయం తెలిసి కావాలనే బీఆర్‌ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యేలా వ్యవహరించారన్నారు.
బీఆర్‌ఎస్ నేతలు, దళారీలు వేర్వేరు కాదు..
2021 నాటికి 21 లక్షల 93వేల 50 ఎకరాలను పార్టు బి కింద నిషేధిత జాబితాలో పెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2023 నాటికి ధరణితో తెలంగాణ సమాజానికి కేసీఆర్ గుండు కొట్టారని విమర్శించారు. ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ నేతలు విచ్చలవిడిగా సంపాదించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలు, దళారీలు వేర్వేరు కాదని ఇద్దరూ ఒకటేనని రేవంత్ రెడ్డి అన్నారు. కండువా వేస్తే బీఆర్‌ఎస్ నేత, కండువా తీస్తే దళారీ అని అభివర్ణించారు. అధికారంలోకి వచ్చాక భూముల సమస్య పరిష్కారం కోసం తలలు బద్దలు కొట్టుకున్నామన్నారు. కేసీఆర్, సోమేశ్ కుమార్ తమ మెదడు రంగరించి ధరణి తయారు చేసామని చెప్పారు. కానీ కేసీఆర్ చెప్పింది పచ్చి అబద్ధం అని ఉరిశిక్ష వేసేంతటి పచ్చి అబద్ధమన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో ధరణి పార్ట్
ఇప్పటివరకు చెప్పింది ధరణి పార్ట్ మాత్రమేనని, త్వరలోనే ధరణి పార్ట్ అక్రమాలు బయటపెడతామని సీఎం వెల్లడిచారు. బీఆర్‌ఎస్ సభ్యులు సభలో ఉన్నప్పుడే అన్నీ బయటపెడతామని తెలిపారు. ఈసారి సమావేశాలకు బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీకి వచ్చేలా స్పీకర్ చూడాలని కోరారు. తన కళ్లల్లోకి చూసి మాట్లాడే ధైర్యం వాళ్లకు ఉండదని, టీజీఐఐసీ భూముల్లో జరిగిన అక్రమాలను బడ్జెట్ సెషన్‌లో బయటపెడతామని స్పష్టంచేశారు.
రూ. 533 కోట్లతో హరీష్‌రావు ఫామ్‌హౌస్‌కు బీటీ రోడ్డు..
మాజీమంత్రి హరీష్‌రావుకు రంగనాయకసాగర్ పరిధిలో భూమి ఉందని సీఎం తెలిపారు. రంగనాయక్ సాగర్ కోసం ఇరిగేషన్ శాఖ భూసేకరణ చేసిందని, హరీష్‌రావు కొన్న భూమిని భూసేకరణ జాబితాలోంచి తర్వాత తొలగించార తెలిపారు. రామంచ సర్వే నం.4.20 ఎకరాలకు గాను ఒక ఎకరం తీసుకున్నారని పేర్కొన్నారు. భూసేకరణ కోసం ప్రభుతవ రైతలకు ఎకరాకు రూ.6.20 లక్షల చొప్పున చెల్లించిందని, హరీష్‌రావు మాత్రం రైతుల నుంచి రూ.2.50 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్లు రికార్డులు ఉన్నాయని, రంగనాయకసాగర్ నుంచి తన ఫామ్‌హౌస్‌కు రూ.5.33 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీ నిధులతో టెండర్లు కూడా లేకుండా రోడ్డు వేయించుకున్నారని వెల్లడించారు.
ధరణిని అడ్డుపెట్టుకుని హరీష్‌రావు మామ హనుమంతరావు , ఆయన సోదరుడు మహేష్‌రావు కలిసి 93.33 ఎకరాల భూమిని కొల్లగొట్టారని సీఎం తెలిపారు. హరీశ్‌రావు మామ కూడా 93.33 ఎకరాల భూమిని గౌరవ్ పురానా పేరు ఉంటే హనుమంతరావు పేరు మీదకు మార్చారని సీఎం ఆరోపించారు. 2022లో రాజ్‌హైటెట్ ఫామ్ లిమిటెడ్ మీదకు మార్చుకున్నారని, రాజ్ హైటెక్ ఫామ్ లిమిటెడ్‌లో హనుమంతరావు, హరీష్‌రావు తమ్ముడు భాగస్వామ్యులని సీఎం తెలిపారు.
ఎర్రబెల్లి, గంగుల, సుధీర్‌రెడ్డిలు 650 ఎకరాల ఆసైన్డ్ భూములు కొన్నారు..
బీఆర్‌ఎస్ నేతల ప్రతి ధర్నా వెనుక భూదందా, భూదాహం ఉందని సీఎం ఆరోపించారు. బహదూర్‌గూడలో గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కలిసి సర్వే నం. 28, 62లో 650 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని సీఎం తెలిపారు. బుల్లెట్ ట్రైన్ భూసేకరణ కోసం బహదూర్‌గూడకు వెళ్తే ధర్నాలు చేస్తున్నారు. బహదూర్‌గూడలోని ప్రభుత్వ భూములను వదిలిపెట్టనని సీఎం తెలిపారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లినందుకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఫారెస్టు భూముల నుంచి 106 ఎకరాలు ఇచ్చారని విమర్శించారు.
అదే విధంగా సిరిసిల్లలోనూ 8 వేల ఎకరాల అసైన్డ్ భూములు బీఆర్‌ఎస్ నేతలకు బదలాయించారని తెలిపారు. మై హోం రామేశ్వరావుకు శంషాబాద్ ఏయిర్‌పోర్టుకు అనుకుని 2,647 ఎకరాల భూమి ఉందని, అందులో అసైన్డ్ ఉందన్నారు. అంతేకాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మేళ్లచెరువు మండలంలోని సిమెంట్ కంపెనీకి సంబంధించిన భూముల్లోనూ ప్రభుత్వ భూములున్నాయని సీఎం తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ స్టీపెన్‌సన్‌కు కంటోన్మెంట్ పరిధిలోని రూ. 50 కోట్ల విలువచేసే భూమిని రూ. 1.50 కోట్లకే చెందే విధంగా లబ్ధి చేకూర్చారని విమ్శించారు. సంగారెడ్డి భూమి చిట్టాలను బయటపెడుతానని, ఇలాంటి వాళ్లను క్షమిస్తే మనల్ని భవిష్యత్ తరాలు క్షమించవన్నారు.
సత్యం రామలింగరాజు భూమి కేటీఆర్‌కు ఎలా బదిలీ అయింది?
జన్వాడలో ఉన్న సత్యం రామలింగరాజు చెందిన భూమి హైకోర్టులో వివాదంలో ఉండగానే కేటీర్‌కు ఎలా బదిలీ అయిందని సీఎం నిలదీశారు. జన్వాడలో సర్వే నం.311లో ఉన్న భూమిని ఇన్‌కమ్ టాక్స్ వారు సీజ్ చేశారని సీఎం గుర్తు చేశారు. ఐటీ అటాచ్ చేసిన భూమి శతభిష కంపెనీ నుంచి బదిలీ అయ్యిందని, 2015లోకి ఆచంట మల్లన్న చేతుల మీదుగా కేటీఆర్‌కు బదిలీ అయ్యిందని, శతభిష ఆగ్రో ప్రైవేటు లిమిటెడ్ అనేది సత్యం రామలింగరాజుకు సంబంధించిందని, 2019లో ధరణి కాంట్రాక్టు కట్టబెడితే జన్వాడ భూములు బదిలీ అయ్యాయని సీఎం పేర్కొన్నారు. జన్వాడలో కేటీఆర్ ఫామ్‌హౌస్ కట్టుకున్నారని తెలిపారు. ఆ భూమిపై డ్రోన్ కెమెరాలు ఎగురవేశారని తనను జైల్లో పెట్టారని సీఎం తెలిపారు.
జగదీష్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో 11.5 ఎకరాల ఇనాం భూమి..
మాజీ మంత్రి జగదీష్‌రెడ్డికి ఉన్న 50 ఎకరాల ఫామ్‌హౌస్‌లో 11.5 ఎకరాల ఇనాం భూమి ఎలా వచ్చిందని సీఎం నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అజీజ్‌గనర్‌లో అసైన్డ్ భూమిలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారని సీఎం ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సొంతూరు తిమ్మాపూర్‌లో 77 ఎకరాల భూదాన్ భూమి ప్రైవేటుపరమైందన్నారు. ఒక దినపత్రిక యజమాని దామోదర్‌రావుకు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ బెంజికారు ఎందుకు ఇచ్చారో కేసీఆర్ విచారణకు అడుగుతారా..? అని ప్రశ్నించారు.
నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కేసీఆర్ లేఖ రాస్తారా..?
‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిందని అంటున్నారు. దాదాపు ఈ కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండాల్సిందే. ఇందులో నుంచి ఇంచు భూమైనా తీయగలిగే శక్తి ఈ ప్రభుత్వానికి ఉండదు. నేను అధికారికంగా కేసీఆర్‌కు సవాల్ విసురుతున్నాను.. నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించండి అని కేసీఆర్ తే లేఖ రాయాలి. ఈ కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో లేకుంటే పేదలకు అన్యాయం అవుతుంది.
అసలు వివాదం అంతా 3.73 లక్షల ఎకరాల ప్రైవేట్ పట్టా భూముల గురించే.. 3.73 లక్షల ఎకరాలను చూపి కోటి ఎకరాలు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. నిషేధిత జాబితాలో ఏ భూములు పెట్టాలో గతంలో హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2025లో నిషేధిత భూముల జాబితాను పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. ’ అని సీఎం వివరించారు.
22 ఏ అంశంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని, మా బాధ్యతను ఇంకెవరో గుర్తుచేయాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం అని అసెంబ్లీ కంటే ముందే 22 ఏ సమస్యపై ఫోకస్ పెట్టామన్నారు. ఎల్బీనగర్‌లో నియోజక వర్గంలోని ఇండ్ల స్థలాల సమస్యతో పాటు 58, 59 జీవోలోని సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం తెలిపారు.
భూ రికార్డులకు కాస్రా పహానే ఆధారం..
భూదాన్ భూములు కూడా కబ్జా జరిగాయని వాటిని కూడా బయటపెడాతన్నారు. ఏపీ రెవెన్యూ విధానం బ్రిటీష్ వారిదైతే మనదినిజాం విధానం అని ఏపీ, రాయలసీమ రెవెన్యూ రికార్డులు పక్కాగా ఉంటుందన్నారు. తెలంగాణలో 60 శాతం దివానీ భూములు రాజ్యానివేనని నిజాం సర్కార్ 60 శాతం భూములను కొలిచి హద్దులు నిర్ణయించారన్నారు. ఎకరాలు గజాలుగా మారినప్పుడు భూమి తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వ భూముల నుంచి ప్రైవేటుకు మారడం వల్ల సమస్యలు వచ్చాయన్నారు. 1948 నుంచి 1954 వరకు భూముల వివరాలు నమోదు చేశారని ఆరేళ్ల పాటు వివరాలు నమోదు చేసి చసాలా పహానీ రూపొందించారన్నారు.
ఇప్పటికీ మనకు ఉన్న అధికారిక రికార్డులు కాస్రా పహానీయే నని కాస్రా పహానీలో అనుమానం వస్తే చసాలా పహానీ వెతుకుతారన్నారు. 1908లో తొలిసారి నిజాం సర్కార్ రెవెన్యూ విధానం చేసిందని 1936లో భూహక్కుల రికార్డు నిర్వహణకు చట్టం తెచ్చారన్నారు. 1975లో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల భూములను కాపేడేందుకు 1ఆఫ్ 70చట్టం తెచ్చిందని, దీని ప్రకారం గిరిజనుల భూములను గిరిజనేతరులు కొనడం నిషిద్ధం అన్నారు. భూమి మీద తెచ్చిన చారిత్రాత్మక చట్టం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అన్నారు. మిగులు భూములను పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం పంచిపెట్టిందని 1975లో అసెన్డ్ భూముల అమ్మకాలను నిషేధిస్తూ చట్టం తెచ్చిందన్నారు.
మంత్రి పొంగులేటిపై కక్షపూరిత కుట్రలు..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముక్కుసూటి మనిషి కావడంతో కొందరికి ఆయనపై కక్ష పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 22ఏ నిబంధనలపై కావాలనే కుట్రలు పన్నుతూ, పొంగులేటిని ఒక భూతంలా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలకు పొంగులేటి బాధ్యుడు కాదని సమర్థించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ దోపిడీలో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కొందరి చేతుల్లోకి వెళ్లాయని, గత ప్రభుత్వ భూదోపిడీ బండారాన్ని బయటపెడితే రాస్తే రామాయణం.. చెప్తే భారతం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. 22 ఏపై ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలు స్వీకరిస్తామన్నారు.
క్షుద్రపూజల అంశం చర్చకు వస్తుందనే..
గత బీఆర్‌ఎస్ హయాంలోని తప్పిదాలపై సభలో చర్చ జరుగుతుందని, కొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్రపూజల అంశం చర్చకు వస్తుందనీ బీఆర్‌ఎస్‌కు తెలుసని.. అందుకే ఎట్టి పరిస్థితుల్లో సభలో ఉండకూడదని వికృత చేష్టలు ప్రదర్శించారని సీఎం అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలపై చర్చ జరగకూడదనేదే బీఆర్‌ఎస్ విధానం అని అసెంబ్లీ నిర్వహణపై గత ప్రభుత్వ రూల్స్ నే మేమూ పాటించామన్నారు. నినాదాలతో కూడిన డ్రస్సులు, ప్లకార్డులతో అసెంబ్లీకి రావొద్దని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే రూల్స్ పెట్టారన్నారు.
స్పీకర్ ఆదేశాల మేరకే గేట్ నంబర్ 3 వద్ద అధికారులు అడ్డుకున్నారని అన్నారు. పార్లమెంట్‌లో ఇలాంటి రూల్ ఉన్నా అక్కడ రాహుల్ ను అడ్డుకునేవారన్నారు. గత ప్రభుత్వం పెట్టిన అసెంబ్లీ రూల్స్ ను బీఆర్‌ఎస్ బ్రేక్ చేసిందని సభ బయట పోలీసులపై దాడి చేయడంతో పాటు సభాధ్యక్షుడిని అసభ్యకరంగా మాట్లాడారన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు విచక్షణ కోల్పోయి అహంకారాన్ని ప్రదర్శించారని విమర్శించారు.