20 May, 2026 | 2:42 AM

పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు

20-05-2026 01:28 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ మూవీ అధికారిక టైటిల్ ‘డ్రాగన్’ అని ఖరారు చేసింది టీమ్. ఈ గ్లింప్స్‌తోపాటు సినిమా ప్రపంచ వ్యాప్త విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా 2027, జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని వెల్లడించారు. ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా లో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర పవర్‌ఫుల్ డ్రామా సీన్ల కోసం ప్రముఖ దర్శకుడు-, రచయిత దేవ కట్టా కూడా స్క్రిప్ట్ వర్క్‌లో భాగస్వామ్యమయ్యారు. బుధవారం ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసింది చిత్రబృందం. ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల భారీ నిడివితో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఈ సుదీర్ఘ గ్లింప్స్‌లోనే కథా నేపథ్యాన్ని, అందులోని ప్రధాన పాత్రలను స్పష్టంగా పరిచయం చేశారు. అయితే, గ్లింప్స్ మొత్తం 4 నిమిషాల 35 సెకన్లు ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ 47 సెకన్లు మాత్రమే ఉంది. ఆ తక్కువ సమయంలోనే ఆయన చూపించిన ఇంటెన్సిటీ, కళ్లల్లోని క్రూరత్వం అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. మునుపెన్నడూ చూడని ఒక విలక్షణమైన, రా ఏజెంట్ లేదా గ్యాంగ్‌స్టర్ లుక్‌లో మెప్పించారు ఎన్టీఆర్. ‘దేవుడు నాకో గొప్ప వరం ఇచ్చాడు.. ట్రిగ్గర్ నొక్కగానే మరిచిపోవడం. నిదురపోయినప్పుడు నా కలలోకి నేను చంపిన వారి ముఖాలు రావు.. మిగిలున్న శత్రువుల ముఖాలే కనబడతాయి.

పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు” అంటూ ఎన్టీఆర్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ అభిమానులతో ఈలలు వేయించేలా ఉంది. అయితే, దాదాపు ఐదు నిమిషాల గ్లింప్స్‌లో ఎన్టీఆర్ నిమిషం కంటే తక్కువ సమయమే కనిపించడం అభిమానులను కొద్దిగా నిరాశకు గురిచేసింది. మిగతా 2 నిమిషాల 59 సెకన్ల పాటు సినిమాలో ఉండే ఇతర కీలక పాత్రలు, వారి పేర్లు, సముద్ర తీరాలు, పేలుళ్లు, మంటలతో కూడిన ఒక భీకరమైన డ్రాగన్ ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు నీల్.