మహిళల సమస్యలు పట్టవా?
- మహిళలకు ఇచ్చిన హామీలెమయ్యాయి?
బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి
హామీల అమలుకై అసెంబ్లీ ముట్టడికి యత్నం.. అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25(విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మహిళా నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తుకారాంగేట్, అఫ్జల్‌గంజ్, ఫలక్‌నుమా, నారాయణగూడ, సీతాఫల్ మండి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల సమస్యలు పట్టవని విమర్శించారు. హామీలపై నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. మహిళలకు ప్రతీనెలా ఇస్తామన్న రూ.2,500 ఏమయ్యాయని ప్రశ్నించారు. 18 ఏండ్లు నిండిన యువతులకు బైక్ ఇస్తామన్న హామీని విస్మరించారని మండిపడ్డారు. ఆడపిల్ల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం ఎప్పుడిస్తారని నిలదీశారు.
హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు, హత్యలు పెరుగుతున్నాయని వాటిని నియంత్రించాలని డిమాండ్ చేశారు.






