5 July, 2026 | 4:36 PM

అభివృద్ధి పనుల కోసం మున్సిపల్ ముట్టడి

05-07-2026 04:00 PM

మెట్‌పల్లి,(విజయక్రాంతి): పట్టణంలో అభివృద్ధి పనులు వారం రోజుల్లో ప్రారంభించక పోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి చేపడతాం అని బిజెపి పట్టణ అధ్యక్షులు ధోనికెల నవీన్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్, వైస్ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్, బిజెపి నాయకులతో కలిసి మాట్లాడుతూ... మున్సిపల్ పరిధిలోని ఇరవై ఆరు వార్డులలో అభివృద్ధి పనుల కోసం మంజూరైనటువంటి నిధులతో అభివృద్ధి పనులు వారం రోజుల్లో ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు.

మున్సిపాలిటీలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అభివృద్ధి పనులు ప్రారంభించాలని పూర్తి బాధ్యత అధికారుల దేననీ అధికార పార్టీకి చెందిన కొందరు అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తూ అడ్డుపడుతున్నారని తెలిపారు. ఆయా పార్టీల నేతలు అభివృద్ధి పట్ల ఏ నిర్ణయం తీసుకుంటారో వారికె వదిలేస్తున్నామని అన్నారు. ఈ రాజకీయ చదరంగంలో అధికారులు బలికాకుండా చూసుకోవాలని అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీ అన్నీ పార్టీలతో కలిసి వస్తదని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.

అధికార పార్టీ నేతల అహంకారంతో అధికారులు మెట్ పల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహించడానికి భయపడుతున్నారని, దింతో లాంగ్ లీవ్, బదిలీ లు పెట్టుకుంటున్నారని అన్నారు.దీనికి అధికార పార్టీ పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. రాజకీయాల కతీతంగా అభివృద్ధి జరగాలి తప్ప అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడం దుర్మార్గమని అన్నారు. వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు వైకుంఠధామాలు అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు ఉండి కాంటాక్ట్లకు అగ్రిమెంట్ అయి రోజులు గడుస్తున్న తమ కమిషన్ల కోసం అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని విమర్శించారు.