మహిళా శక్తి పెట్రోల్ బంక్ పరిశీలించిన డీఆర్డీవో పీడీ
సంగారెడ్డి, ఏప్రిల్ 21: ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్యోతి స్థానిక మహిళా శక్తి పెట్రోల్ బంక్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పెట్రోల్ బంక్లో అందిస్తున్న సేవలను, నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు.
ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉన్న టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, అవి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. అదేవిధంగా పెట్రోల్ బంక్కు సంబంధించిన రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల వివరాలు తదితర పుస్తకాలను పరిశీలించి, అన్ని వివరాలు పారదర్శకంగా నమోదు చేయాలని సూచించారు.
పెట్రోల్ బంక్ లావాదేవీలను సమగ్రంగా పరిశీలించి, పూర్తి స్థాయి రీకన్సిలియేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా పరిశుభ్రత, పారదర్శకత, బాధ్యతాయుత నిర్వహణ చాలా కీలకమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి సంస్థపై ఉందని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో సంబంధిత అధికారులు, పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.






