పుట్టిన పాపకు జన్యుపర చర్మ సమస్య
ప్రభుత్వ టీచర్ లకు అక్కరకు రాని హెల్త్ కార్డ్...!
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ కార్డులతో నగదు రహిత వైద్యానికి నిరాకరణ
ఆందోళనలో ఉద్యోగులు
బాన్సువాడ, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): జన్యుపర చర్మ సమస్యతో పుట్టిన కూతురికి వైద్యం కోసం ఓ ప్రభుత్వ టీచర్కు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (EHS) కార్డు అక్కరకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలం మక్దూంపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మొహమ్మద్ షఫీక్ కు ఆగస్టు 21 న కూతురు జన్మించింది. పాపకు పుట్టుకనుంచి చర్మంపై పెద్ద పెద్ద పొక్కులు వచ్చి చర్మం ఊడిపోతుంది.పెద్ద పెద్ద గాయాలు శరీరమంతా విస్తరిస్తున్నాయి. దీంతో పాపాను చికిత్స నిమిత్తం ఆగస్టు 27 వ తేదీన సికింద్రబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ ఈహెచ్ఎస్ కార్డు పని చేయదన్నారు. పాపకు అత్యవసర చికిత్స అవసరం ఉండడంతో కొంత మొత్తం డబ్బులు అడ్వాన్స్ గా చెల్లించి అక్కడే ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స కొనసాగుతోంది.15 రోజుల నుండి వైద్యం కొనసాగుతోంది. ఎంప్లాయ్ హెల్త్ కార్డ్ పనిచేయక పోవడంతో రోజుకి వేలలలో ఖర్చు అవుతుందని పాప తండ్రి మొహమ్మద్ షఫీక్ వాపోయారు. పాప తో పాటు తల్లి,తండ్రి బాలింతను చూసుకోవడానికి అక్కడే ఉండవలసి రావడంతో రోజుకు ఆ ఖర్చులు అదనంగా అవుతున్నాయి.
హెల్త్ కార్డ్ పనిచేయక పోవడంతో ఎంత బిల్లు చెల్లించవలసి వస్తుందోనని పాప తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.పాపను హెల్త్ కార్డ్ లో చూపించిన, గత నాలుగు నెలల నుండి హెల్త్ కార్డు కోసం ప్రతినెల వేతనం నుండి డబ్బులు కట్ అవుతున్న అవసరమున్న సమయం లో ఉచిత వైద్య అందడం లేదని వారు వాపోయారు.సమస్యను ప్రభుత్వం అర్థంచేసుకొని ఈ.హెచ్.ఎస్ కింద నగదు రహిత వైద్యం అందేలా చూడాలని వారు కోరుతున్నారు.