31 July, 2026 | 4:41 PM

దేవరకద్ర మండల నూతన కార్యవర్గం ఎన్నిక

31-07-2026 04:03 PM

దేవరకద్ర టీయూడబ్ల్యూజే (IJU) అధ్యక్షుడిగా యాకూబ్, కార్యదర్శిగా సారంగం

దేవరకద్ర: ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న టీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్, దేవరకద్ర నియోజకవర్గంలోనే అతిపెద్ద యూనియన్‌గా విస్తరించింది. స్థానికంగా నిర్వహించిన ముఖ్య సమావేశంలో పలువురు విలేకరులకు నూతన మెంబర్‌షిప్‌లు అందజేయడంతో పాటు దేవరకద్ర మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కాటం నాగరాజు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, కోశాధికారి జిల్లెల రఘు లతో పాటు పలువురు జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరై, నియోజకవర్గంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఐక్యత, యూనియన్ బలోపేతం మరియు భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. విలేకరుల ఇళ్ల స్థలాలు, అక్రమ కేసుల నిరోధం, హెల్త్ కార్డ్‌ల సాధన వంటి అంశాలపై యూనియన్ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రకటించిన దేవరకద్ర మండల టీయూడబ్ల్యూజే (IJU) నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా యాకూబ్ ('వార్త' దినపత్రిక), ప్రధాన కార్యదర్శిగా సారంగం ఎన్నికయ్యారు. జర్నలిస్టుల హక్కుల పోరాటంలో నూతన కార్యవర్గం ఎల్లప్పుడూ ముందుండి పనిచేయాలని, ప్రతీ విలేకరి సమస్య పరిష్కారానికి యూనియన్ నిరంతరం అండగా ఉంటుందని జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది.

ఇదే సమయంలో, సభ్యత్వాల పేరుతో ప్రస్తుతం తిరుగుతున్న ప్రత్యర్థి యూనియన్ గడిచిన పదేళ్ల కాలంలో ప్రభుత్వాలతో అంటకాగిందే తప్ప జర్నలిస్టులకు ఒరగబెట్టిందేమీ లేదని, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేసిందని పలువురు సీనియర్ జర్నలిస్టులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై పూర్తి స్థాయిలో గళమెత్తుతామని నూతన కమిటీ స్పష్టం చేసింది.