పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
కాగజ్నగర్, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని, కాగజ్నగర్ పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు (Sirpur MLA Dr. Palvai Harish Babu) ప్రభుత్వాన్ని కోరారు.
గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జరిగిన చర్చలో ఆయన ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు 114 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
గత ప్రభుత్వం 2018 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నప్పటికీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించకుండా కార్మికులకు అన్యాయం చేసిందని ఆరోపించారు.పేపర్ మిల్లు పునఃప్రారంభ సమయంలో జీఓ నంబర్ 17 ప్రకారం యాజమాన్యానికి రూ.100 కోట్లను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందించిందని హరీష్ బాబు తెలిపారు. అయితే సిర్పూర్ పేపర్ మిల్లును టేకోవర్ చేసిన జేకే పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికుల హక్కులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మిల్లులో కార్మికులకు కనీసం క్యాంటీన్ సౌకర్యం కూడా అందుబాటులో లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్-టి, బెజ్జూరు మండల కేంద్రాల్లో బస్ స్టేషన్ల నిర్మాణానికి గతంలో పలుమార్లు ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.కాగజ్నగర్ బస్ స్టేషన్ సమీపంలో తన తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే పురుషోత్తం రావు హయాంలో బస్ డిపో నిర్మాణం కోసం నాలుగు ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు.
అయినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి గానీ, ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదన్నారు.ప్రభుత్వం సంబంధిత శాఖల మంత్రులు, అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు కాగజ్నగర్ బస్ డిపో, సిర్పూర్-టి, బెజ్జూరు బస్ స్టేషన్ల నిర్మాణాలను చేపట్టాలని కోరారు.