ఉద్యోగుల ఉమ్మడి పోరు
ఈ నెల10న టీజీఈజేఏసీ చలో హైదరాబాద్ :
ప్రభుత్వ ఉద్యోగులు(Government employees) రాష్ట్ర పరిపాలనకు వెన్నెముక, ప్రజాసేవకు ప్రత్యక్ష ముఖచిత్రం. ప్రభుత్వం రూపొందించే సంక్షేమ పథకాలు(Welfare schemes), అభివృద్ధి కార్యక్రమాలు(development programs) ప్రజల గడపకు చేరేది ఉద్యోగుల కృషితోనే. పాఠశాలలో విద్యాబోధన(Teaching) నుంచి ఆసుపత్రుల్లో వైద్యం, గ్రామస్థాయి పాలన నుంచి రెవెన్యూ, సంక్షేమ సేవల వరకు ప్రతి రంగంలో ఉద్యోగుల నిబద్ధత ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు(Telangana Government Employees) ఆర్థిక హక్కులు(Financial Rights) దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటం తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ(Telangana Employees Unions JAC) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, 1.7.2023 నుంచి మెరుగైన ఫిట్మెంట్‌తో 2వ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి. మూడు సంవత్సరాల నుంచి కాలయాపన జరుగుతుంది. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగులు(Employees), పెన్షనర్లకు(pensioners) సంబంధించిన పెండింగ్ బిల్లులను నెలకు కనీసం రూ.2,000 కోట్ల చొప్పున చెల్లిస్తూ నిర్ణీత కాలంలో పూర్తిగా పరిష్కరించాలి.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదు. ఇటీవల ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం చొప్పున కోత విధించి అమలు చేస్తున్న కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేసి ఉద్యోగులుపెన్షనర్లకు నాణ్యమైన నగదు రహిత వైద్య సేవలు అందించాలి.
ఉద్యోగుల డిమాండ్లన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు ఏకమై ఉమ్మడి పోరాటానికి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేసే విధంగా డీఏను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సవరిస్తూ వస్తోంది. పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు రావాల్సిన డీఏను క్రమబద్ధంగా నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వ వేతన విధానంలో ఒక ముఖ్యమైన అంశం.
2026 జూలై విడత డీఏపై కూడా ద్రవ్యోల్బణ సూచీల ఆధారంగా తదుపరి సవరణపై అంచనాలు ఉన్నాయి. అంటే కేంద్ర ఉద్యోగులకు డీఏ ను కాలానుగుణంగా సమీక్షించి అమలు చేసే వేతన అంశంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 2026 జూలై డీఏ కూడా 64%కు పెరిగే అవకాశం ఉంది. దీనికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. టీజీఈజేఏసీ ప్రకారం 2024 జనవరి నుంచి 2026 జూలై వరకు రావాల్సిన డీఏలు కూడా చెల్లించాల్సి ఉంది.
పీఆర్సీ జాప్యం, పెండింగ్ బకాయిలు, పెన్షన్ భద్రతపై అనిశ్చితి, ఆరోగ్య సదుపాయాల లోపాలు, ఉద్యోగుల ఆర్థిక, సామాజిక జీవితంపై ప్రభావం చూపుతున్నాయి. ఉద్యోగ సంఘాల ప్రకారం 2026 ఆగస్టు నాటికి తెలంగాణ ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. సెప్టెంబర్ 6న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చలో హైదరాబాద్‌ను వాయిదా వేయాలని కోరిన నేపథ్యం లో ఉద్యోగ సంఘాలు రాతపూర్వక హామీ కోరుతున్నాయి.
అయినా ప్రభుత్వ నుంచి హామీ రాలేదు. డీఏ ప్రభుత్వం చేసే దానం కాదు, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని భర్తీ చేయడానికి ఉద్యోగికి దక్కాల్సిన హక్కు. పీఆర్సీ కూడా కేవలం జీతం పెంపు కోసం చేసే డిమాండ్ కాదు. ఉద్యోగి శ్రమ, జీవన వ్యయం, ఆర్థిక భద్రతకు సంబంధించిన న్యాయమైన హక్కు.
ఈ క్రమంలో సంవత్సరాలు తరబడి అపరిస్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల నేపథ్యంలో సెప్టెంబర్ 10 చలో హైదరాబాద్ నిరసన సభకు దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జేఏసీ ఎల్బీ స్టేడియంలో అతి పెద్ద ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇది ఉద్యోగఉపాధ్యాయుల ఐక్యతకు, ప్రభుత్వంపై ప్రజాస్వామ్య ఒత్తిడి పెంచడానికి ఒక కీలక వేదికగా మారనుంది. ప్రతి ఉద్యోగి తన హక్కు కోసం నిలబడటమే నిజమైన ఉద్యమం. కావున ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక, సామాజిక భద్రతకు ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది.
సామాజిక విశ్లేషకులు, 7989579428