3 September, 2026 | 12:56 PM

గంజాయి రాణి ఆస్తులపై ఈడీ పంజా!

03-09-2026 | 12:22pm

నానక్‌రాంగూడ కేంద్రంగా నడిచిన రాకెట్‌పై మనీలాండరింగ్ దర్యాప్తు  

పరారీలోని నీతూ బాయి, ఆమెకు సంబంధించిన మూడు ప్రాంతాల్లో సోదాలు

శేరిలింగంపల్లి,సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): నగరంలో గంజాయి దందాకు(Ganja trade) కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీతూ బాయి ఆస్తులపై(Neetu Bai properties) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం ఉదయం నుంచి సోదాలు జరుగుతుంది. సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో(Cyberabad Narcotics Police Station) ఈగల్ టీం నమోదు చేసిన కేసుల ఆధారంగా పీఎంఎల్‌ఏ చట్టం(PMLA Act) కింద ఈడీ కేసు నమోదు చేసుకుని, అక్రమ ఆదాయం జాడ వెతుకుతోంది. నీతూ బాయి ప్రస్తుతం పరారీలో ఉంది.

ఆమెకు సంబంధించిన ఇళ్లు, కుటుంబ సభ్యులు, అనుచరుల స్థావరాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ము ఎలా తిప్పారు, బ్యాంకు లావాదేవీలు ఎలా జరిగాయి, ఆస్తులు ఎలా కూర్చుకున్నారు అనే అంశాలపై దర్యాప్తు కేంద్రీకృతమైంది. నషా ముక్త్ భారత్(Nasha Mukt Bharat Abhiyan) కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల కేసుల్లో ఆర్థిక జాడలను వెలికితీస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ ఈడీ చర్యలు ముమ్మరం అయ్యాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఐటీ కారిడార్‌లో గంజాయి రాకెట్

ఈగల్ రికార్డుల ప్రకారం నానక్‌రాంగూడలో థాబస్తీలోని నివాసం నుంచే కుటుంబ సహాయంతో రిటైల్ గంజాయి విక్రయాలు సాగినట్లు ఆరోపణ. ఐటీ ఉద్యోగులను(IT employees) లక్ష్యంగా చేసుకుని దందా నడిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. జూన్ నెలలో ఈగల్ టీం ఇంటి దగ్గర నిఘా పెట్టినప్పుడు కొనుగోలుదారులుగా అనుమానిస్తున్న పలువురిని నిర్బంధించినా, నీతూ బాయి తప్పించుకున్నట్లు నమోదైంది.ఆమెపై గతంలోనూ పలు ఎన్‌డీపీఎస్ కేసులు(NDPS cases), ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్డర్లు ఉన్నాయి. గతంలో నగదు, బ్యాంకు ఖాతాలు, స్థిరాస్తులు స్వాధీనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

అయినా దందా పూర్తిగా ఆగలేదని అధికారులు ఆరోపిస్తున్నారు.పోలీసు కేసులు నేరం నిర్ధారణకు సంబంధించినవి అయితే, ఈడీ దృష్టి డబ్బు మీదే. అక్రమ సొమ్మును హవాలా ద్వారా తరలించారా, ఇళ్లు-ఖాతాల్లో దాచారా, కుటుంబం పేరిట ఆస్తులు కూర్చుకున్నారా అనేవి ప్రధాన ప్రశ్నలు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు నిర్ణయిస్తారని తెలుస్తోంది. నీతూ బాయిని పట్టుకోవడంతో పాటు, ఆర్థిక వలయాన్ని ఛేదించడమే ప్రస్తుత లక్ష్యమని దర్యాప్తు వర్గాలు సూచిస్తున్నాయి.