3 September, 2026 | 1:06 PM

గల్లీ "టూ" పల్లె దాకా గుప్పుమంటున్న "గంజాయి" ఘాటు.!

03-09-2026 | 12:32pm
  1. యువతను మత్తులోకి లాగుతున్న మాయజాలం
  2. పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనే తనిఖీలు... దాడులు
  3. నిద్రమత్తులో బాన్సువాడ ఎక్సైజ్ శాఖ అధికారులు
  4. అడ్డుకట్ట వేయకుంటే భవిష్యత్‌ ప్రశ్నార్థకమేనా.?
  5. నియంత్రణపై అధికారులు నిఘా పెంచాలని ప్రజల డిమాండ్

బాన్సువాడ,సెప్టెంబర్ 3(విజయక్రాంతి): పట్టణాలకే పరిమితం అయింది అనుకున్న గంజాయి సమస్య(Marijuana) క్రమ క్రమంగా  గ్రామాలు, పల్లెలు, గల్లీలకూ విస్తరిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మత్తు పదార్థాల ప్రభావం యువతపై పడకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కుటుంబాలు, విద్యాసంస్థలు, ఎక్సైజ్, పోలీసులు, స్థానిక అధికారులు అందరిపైనా ఉంది. గంజాయి వినియోగం(Cannabis use) ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉండటంతోపాటు, చిన్న వయసులోనే మత్తు పదార్థాల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2018 జాతీయ సర్వేలో 10–17 ఏళ్ల వయసు పిల్లలు, కిశోరుల్లో సుమారు 20 లక్షల మంది ప్రస్తుతం గంజాయి వినియోగిస్తున్నట్లు అంచనా వేశారు.

గల్లీ నుంచి పల్లె వరకు గంజాయి సమస్య విస్తరించకుండా సరఫరాపై కఠిన నిఘా, యువతకు అవగాహన, అవసరమైన వారికి కౌన్సెలింగ్‌–చికిత్స అనే మూడు అంశాలపై సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యువత భవిష్యత్తును కాపాడేందుకు సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎక్సైజ్ శాఖ(Banswada Excise Department) అధికారుల తీరు చూస్తే నిద్రమత్తులోనే వ్యవస్థ ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇప్పటివరకు గంజాయి సేవిస్తున్న యువకులను కానీ సరఫరా చేస్తున్న వ్యక్తులను కానీ పట్టుకున్న దాఖలాలు లేవని వాళ్ళు ఆరోపణలు వినవస్తున్నాయి కేవలం విధులకు వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా కొంతమంది అధికారుల తీరు కొనసాగుతుందని ప్రజలు వారి తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడలో పోలీస్ శాఖ(Banswada Police Department) ఆధ్వర్యంలో గంజాయి సేవిస్తున్న యువకులతో పాటు అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న వాహనాలను వ్యక్తులను పట్టుకుని కేసులో నమోదు చేసి రిమాండ్కు తరలించిన ఘటనలు ఉన్నాయి పోలీసుల పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గల్లీ నుంచి పల్లె వరకు మత్తు పదార్థాల ప్రభావం విస్తరించకుండా అధికారులు ఇప్పటికైనా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ముందస్తు చర్యలే శాశ్వత పరిష్కారానికి మార్గమని పలువురు పేర్కొంటున్నారు.

విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి...

విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల ప్రభావాన్ని అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు, ముందస్తు గుర్తింపు, కౌన్సెలింగ్ వంటి చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. 2026లో కేంద్ర ప్రభుత్వం ‘నషా ముక్త్ విద్యాలయ’ కార్యక్రమం కింద పాఠశాలల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన, ముందస్తు జోక్యానికి చర్యలు చేపట్టాలని సూచించింది

యువతే టార్గెట్‌గా...?

మత్తు పదార్థాల వైపు యువత ఆకర్షితులైతే వారి చదువు, ఉద్యోగ అవకాశాలు, కుటుంబ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదట సరదాగా ప్రారంభమయ్యే అలవాటు క్రమంగా తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉండటంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు కనిపించినప్పుడు వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి సమస్యను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

నిర్మానుష్య ప్రాంతాలపై నిఘా ఏది...?

పట్టణాలు, గ్రామాల్లోని నిర్మానుష్య ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు, శివారు ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే ప్రజలు స్వయంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. గంజాయి విక్రయాలు, రవాణా లేదా నిల్వకు సంబంధించిన సమాచారం అందినప్పుడు చట్ట ప్రకారం విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రత్యేక బృందాలతో గంజాయి రవాణా అరికట్టాలి...

గల్లీల నుండి పల్లెల దాకా విస్తరిస్తున్న గంజాయి ఘాటును పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు చేపట్టి అక్రమ రవాణా సరఫరాను అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా గంజాయి ఘాటుకు యువత బలైపోతుందని చెడు వ్యాసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గంజాయి ఘాటును అరికట్టి యువత ప్రాణవాలను కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.