17 March, 2026 | 4:24 AM

రాష్ట్ర అభివృద్ధిలో.. ప్రతి పౌరుడు భాగస్వామి

17-03-2026 02:04 AM

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన

2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

  1. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే క్యూర్-ప్యూర్-రేర్ మోడల్ 
  2. అధునాతన నగర నిర్మాణం కోసమే మూసీ పునరుజ్జీవం
  3. సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత 
  4. అసెంబ్లీలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి) : తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిలో ప్రతి పౌరుడిని భాగస్వామిని చేసి భవిష్యత్ తెలంగాణను నిర్మిస్తోందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా స్పష్టంచేశారు. స్వపరిపాలన, స్వరాష్ట్ర సాధన లక్ష్యాలతో తెలం గాణ ప్రాంత ప్రజలు చేసిన సుదీర్ఘ పోరా ట ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని, రాష్ట్ర ఏర్పాటుకు అమరులైన వారి త్యాగాలను స్మరిస్తూ... పోరా డిన ఉద్యమకారులను గౌరవిస్తూ ప్రభు త్వం ప్రజా పాలన స్ఫూర్తిని కొనసాగిస్తున్నదని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం, ప్రతి విధానం, ప్రతి కార్యాచరణలో ప్రజల ఆత్మగౌరవం, సంక్షేమం, సామాజిక సమానత్వం పాటిస్తుందని, అదే ప్రజాపాలనకు గీటురాయి అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ప్రపంచంలోనే గుర్తింపు పొందిన రాష్ట్రం గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌తో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఈ లక్ష్య సాధనకు బలమైన పునాదులు వేసేందుకు..  గత సంవత్సరం మా ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిం దని గుర్తు చేశారు.

సోమవారం బడ్జెట్ సమావేశాలు తొలిసారి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపనతో ప్రారంభమయ్యాయి. అనంతరం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయపథంలో కొనసాగుతున్నదని, ఆర్టీసీ బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు 269.68 కోట్ల జీరో టికెట్లు ఇచ్చారని, రాష్ట్రంలో మహిళలు రూ.9,222 కోట్లకు పైగా ఆదా చేసుకున్నారని తెలిపారు. 

ఆర్థిక వ్యవస్థకు రోడ్‌మ్యాప్..

‘వికసిత్ భారత్ - 2047 విజన్’కు అనుగుణంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్‌ను రూపొందించిందన్నారు. 2034 నాటికి వన్ ట్రిలి యన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. దేశ జాతీయ వృద్ధి రేటు 8 శాతం, ద్రవ్యోల్బణం 1.72 శాతంగా ఉందన్నారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి నమోదు చేస్తోందని, 2025-26లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ. 17.82 లక్షల కోట్లు కాగా 10.7 శాతం వృద్ధి రేటు నమోదు చేసిందని తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.99 శాతమని, రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931కి చేరుకుందన్నారు.  ఇదే సమయంలో, ద్రవోల్బణాన్ని 0.2 శాతానికి నియంత్రించింది. రాష్ట్రంలో ధరల  స్థిరత్వం కొనసాగించిందని పేర్కొన్నారు.

రెండేండ్లుగా ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టిందని, నీటి పారుదల సదుపాయాలు మెరుగుపరిచిందని వెల్లడించారు. వ్యవసా య ఉత్పాదకత పెంచేందుకు అన్నదా తలకు పెట్టుబడి సాయం అందించటంతో పాటు రైతు సంక్షేమ పథకాలు అమలు చేసిందని, పారిశ్రామిక వృద్ధికి పెట్టుబడులను ప్రోత్సాహించిందని, ఐటీ, వాణిజ్యం, పర్యాటకంతో పాటు ఇతర రంగాలలో వృద్ధితో రాష్ట్రంలో సేవల రంగం విస్తరించడం వంటి సమిష్టి ప్రయత్నాలన్నీ రాష్ట్రంలో  స్థిరమైన ఆర్థిక వృద్ధికి దోహదపడ్డాయన్నారు. 

అధునాతన నగరంగా..

హైదరాబాద్ నగరానికి సిటీ ఆఫ్ లేక్ అండ్ రాక్స్ అనే పేరుందని, కోర్ అర్బన్ ఏరియాలో ఉన్న సరస్సులు, చెరువులు, ట్యాంకులను పునరుద్ధరించడానికి ప్రజా ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. హైడ్రా ను ఏర్పాటు చేసి దాదాపు రూ. 60,000 కోట్ల విలువైన 1,045 ఎకరాలకు పైగా ఆక్రమణకు, కబ్జాలకు గురైన చెరువు భూ ము లు, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీ నం చేసుకుందని, ఈ చర్యల ఫలితంగానే  బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బుమ్ రుక్ ఉద్ దౌలా చెరువులు, కుంటలు పూర్వ వైభవం సంతరించుకున్నాయని తెలిపారు.

హైదరాబాద్‌ను అధునాతన నగరంగా తీర్చిదిద్దేందు కు 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్ఫఫర్మేషన్ ప్రాజెక్టును ప్రజా ప్రభుత్వం చేపట్టిందని, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్- ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు.

మూ సీ, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ బోధనలే కేంద్రీకృతంగా ప్రపంచ స్థాయి కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాను న్న కొన్ని సంవత్సరాల్లో తె లంగాణ పశ్చిమ ప్రాంతంలో ఉన్న కొడంగ ల్ ఏరియా ఇండస్ట్రీయల్ హబ్‌గా మారనుందని, ఈ ప్రాంతాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు రాబోయే రేడియల్ రోడ్డు వెంట మల్టీ ప్రొడెక్ట్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తుందన్నారు. 

నెట్ జీరో ఫ్యూచర్ నిర్మాణం..

హైదరాబాద్ నుండి ఫ్యూచర్ సిటీ, అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్, హైదరాబాద్- ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించాలని మా ప్రభుత్వం తలపెట్టిందని, దీంతో వివిధ ప్రాంతాల మధ్య అను సంధానంతో పాటు సరుకుల రవాణా వేగవంతం అవుతుందన్నారు. ఇటీవల, కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణేలకు మూడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను ప్రకటించిందని, శంషాబాద్‌ను బుల్లె ట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దాంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉపయోగపడే రీజనల్ కనెక్టివిటీ బలోపేతం అవుతుందన్నారు.

ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడా నికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వరంగల్,  ఆదిలాబాద్‌లలో విమానాశ్రయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని, ఈ విమానాశ్ర యాలను వేగంగా నిర్మించడానికి  ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని గ్రీన్ ఫీల్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయనున్నామని, 15 నిమిషాల్లో ఎక్కడికైనా చేరుకునే అధునాతన మోడల్‌లో సిటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపే తం చేసే విధం గా ప్యూచర్ సిటీ కోసం దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్‌ను రూపొందించే ప్రక్రి య కొనసాగుతుందని తెలిపారు. 

2025 వానాకాలం పంటలకు, రైతు భరోసా పెట్టుబడి సహాయ పథకం కింద కే వలం తొమ్మిది రోజుల్లోనే రూ. 8,744 కోట్ల ను రైతుల ఖాతాల్లో జమ చేసిందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో, సన్నరకం వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500- చొప్పున బోనస్ ఇచ్చిందన్నారు.

భూమి సంబంధిత సమస్యల శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు, ప్రజా ప్రభుత్వం తెలంగాణ భూ భారతి చట్టం 2025ను అ మలులోకి తెచ్చిందని, ప్రత్యేకంగా భూధార్ వ్యవస్థను తీసుకువచ్చి గ్రామస్థాయిలో భూ  పరిపాలనను బలోపేతం చేయడానికి 5,010 గ్రామ పాలనా అధికారులు, 5,520 లైసెన్స్ పొందిన సర్వేయర్లతో సహా వివిధ స్థాయిలకు చెందిన 8,900 మంది సిబ్బందిని గ్రామాల్లో నియమించిందన్నారు. 

సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత..

సాగునీటి రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, కృష్ణా, గోదావరి నదుల జలాల వాటాల్లో రాష్ట్ర ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని వేదికల్లో కట్టుబడి పని చేస్తోందని, 2004 లో జలయజ్ఞం కింద ప్రారంభమైన ప్రాజెక్టులు 2014-15లో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు.

పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసే కరణ, పునరావాస ప్రక్రియను కొన్ని నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఈ ప్రాజెక్టుల ద్వారా మూడేండ్లలోనే ఆశించిన కొత్త ఆయకట్టుకు నీరందుతుందన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికి సంక్షేమంతో పాటు ఆత్మగౌరవంగా జీవించాలని రాష్ట్రవ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేసిందని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద, రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లను  నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సం ఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి, వాటిని టీజీ ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడానికి  ప్రజా ప్రభుత్వం నిధులు అందించిందని, మొదటి దశలో రూ. 177.84 కోట్లతో 494 బస్సులు కొనుగోలు చేశారని తెలిపారు. తెలంగాణలో విద్యా రంగానికి కొత్త దిశానిర్దేశం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేప ట్టిందని, తెలంగాణ నూతన విద్యా విధానా న్ని రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పా టు చేసిందన్నారు.

రాష్ట్రంలోని అన్ని అసెం బ్లీ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రజా ప్రభుత్వం నిర్మిస్తున్నదని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంతో ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తోందని, రాష్ట్రంలో మాతృ మరణాల నిష్పత్తిని ఆరు కంటే తక్కు వ చేయడం, శిశు మరణాల నిష్పత్తిని 7 కం టే తగ్గించాలనే లక్ష్యంతో పని చేస్తోందన్నారు. 

పంచాయతీ ఎన్నికలే కీలకం..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారి కి ఇదివరకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రజా ప్రభుత్వం తొలగించిందని, దీంతో ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగిందన్నారు. ప్రజా ప్రభుత్వం ఇటీవల గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించిందని, ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని బలోపే తం చేయటంలో కీలకమన్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 1,15,000 మంది ప్రజా ప్రతినిధులందరూ ప్రజలకు సేవ చేయడంలో విజయవంతంగా ముందుకు వెళ్ళా లని సూచించారు. సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల (ఎస్‌ఈఈఈపీసీ) సర్వే నిర్వహించిందన్నారు. సమాజ ంలోని ప్రతి వర్గాన్ని గుర్తిస్తూ.. సామాజిక న్యాయం, సమ్మిళిత పాలన, విధానాల రూపకల్పనకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

74. ఎస్‌ఈఈఈపీసీ సర్వే ద్వారా వచ్చిన వివరాల ఆధారంగా, వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రజా ప్రభుత్వం రెండు ముఖ్య చట్టాలను తీసుకువచ్చిందని, తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టం -2025. ఈ చట్టం ద్వా రా విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అందిస్తుందన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించిందని, రికార్డు సమయంలో  67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, 70 ఏళ్లలోపు పెన్షనర్లకు ఆరోగ్య భద్రత, సామాజిక భద్రతను కల్పించే ఈ పథకం దేశ చరిత్రలోనే మొదటి ప్రయత్నమని తెలిపేందుకు హర్షిస్తున్నామని తెలిపారు. 

గ్లోబల్ సమ్మిట్‌లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు..

ఇటీవల హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిందని, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పారి శ్రామిక రంగంలోని ప్రముఖులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. ఈ సందర్భంగా పలు అవగాహన ఒప్పందాలు చేసుకుని రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని, ఈ పెట్టుబడులతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వేగవంతమ వుతుందన్నారు.

ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పాత్ర పోషించి దేశంలోనే 7వ స్థానంలో నిలిచిందని, మన రాష్ట్ర వస్తువుల ఎగుమతులు రూ.1.61 లక్షల కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంచనాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్ అఛీవర్‌గా నిలవడం హర్షణీయమన్నారు. దేశంలోని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లలో దాదాపు 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు.

తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ. 3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలోని రైతులను వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపడుతుందన్నారు. 

క్యూర్-ప్యూర్-రేర్ మోడల్..

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా, సమతుల్యంగా, సమ్మిళితంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని, అందులో భాగంగా, క్యూర్, ప్యూర్, -రేర్ అంచెలంచెలుగా వికేంద్రీకృత వ్యూహాన్నీ అనుసరించిందన్నారు. కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)ను పర్యావరణ అనుకూలమైన నెట్ జీరో సిటీగా, వరల్ గ్లోబల్ హబ్‌గా అభివృద్ది చేయటం, పెరీ అర్బన్ రీజియన్(ప్యూర్)ను మాన్యుఫ్యాక్షర్, లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయటం, రూరల్ అగ్రి రీజియన్(రేర్)ను రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ వైపరీత్యాలను తట్టుకునేలా వ్యవసాయ అనుకూల విధానాలు, ఎకో టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలను నెలకొల్పటం.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను నిర్మించటం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. 2031 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుకుంటుందని అంచనా ఉందని, పట్టణాల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రజా ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)ని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించి జీహెచ్‌ఎంసీని పునర్వవ్యస్థీకరించిందన్నారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లుగా మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని పునర్వవ్యస్థీకరించి హైదరాబాద్ పోలీసు అధికార పరిధిని విస్తరించిందని తెలిపారు. హిల్ట్ పాలసీ ప్రకారం కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు బయటకు తరలించాలని, క్యూర్ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 

ప్రజా ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరు..

తెలుగు సినిమాలోని అత్యుత్తమ ప్రతిభను గుర్తించడానికి, ప్రభుత్వం 2025లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రారంభించిందన్నారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించి గిరిజన ఆచారాలను, సంప్రదాయాలను కాపాడుతూ వన దేవతల గద్దెల పునర్నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.

భద్రాచలం శ్రీరాముడి దేవాలయం,  వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించే పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆవిష్కరణలలో అగ్రగామిగా, బలహీన వర్గాలకు భరోసాగా,  ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే తెలంగాణను నిర్మించే దిశగా మా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

రాష్ట్ర సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధిపై ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని, అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. ప్రజా ప్రభుత్వ స్వప్నాన్ని సాకారం చేయడానికి.. ఐకమత్యంతో, ఆత్మవిశ్వాసంతో నిలువెత్తు నిబద్ధతతో మనమందరం కలిసి పని చేద్దాం.. తెలంగాణను ప్రపంచంలోనే అగ్రభాగాన నిలుపుదామని పిలుపునిచ్చారు.