27 June, 2026 | 3:19 PM

ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్

27-06-2026 02:15 PM

శిక్షణలో భాగంగా ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ దీపిక

నాగలిగిద్ద, జూన్ 27 (విజయక్రాంతి): తెలంగాణ గ్రూప్-1 పరీక్షల్లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన డాక్టర్ కొమ్మిరెడ్డి లక్ష్మీ దీపిక ప్రస్తుతం పరిపాలనా శిక్షణలో భాగంగా సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ పరిపాలన, భూ సంబంధిత సేవలు, ధృవీకరణ పత్రాల జారీ, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన పెంపొందించుకుంటున్నారు.

శిక్షణ కార్యక్రమంలో భాగంగా కార్యాలయ నిర్వహణ, రెవెన్యూ శాఖ విధులు, ప్రజలకు అందించే సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలో ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరే విధంగా అమలు చేస్తున్న విధానాలను పరిశీలిస్తూ ఫీల్డ్ స్థాయిలో పరిపాలనా అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ పనితీరును కూడా అధ్యయనం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మండల ఎమ్మార్వో సంగ్రామ్ రెడ్డి, డిప్యూటీ ఎమ్మార్వో శివకృష్ణ ఆమెకు శాఖల పనితీరు, కార్యాలయ వ్యవస్థ, ప్రజలకు అందిస్తున్న సేవలపై వివరించారు. కార్యాలయ సిబ్బంది కూడా శిక్షణలో భాగంగా అవసరమైన సమాచారాన్ని అందిస్తూ సహకరించారు. రాష్ట్రంలో తొలి ర్యాంకు సాధించిన అధికారి నాగలిగిద్ద మండలంలో శిక్షణ పొందడం స్థానిక అధికారులతో పాటు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.