27 June, 2026 | 3:22 PM

మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు

27-06-2026 02:18 PM

అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, జూన్-27(విజయ క్రాంతి): మంథని మండలం మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో (Grain procurement center)జరిగిన అక్రమాల వ్యవహారాన్ని జిల్లా యంత్రాంగం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ శాఖ తనిఖీ నివేదికలు, పంచనామా, సంబంధిత అధికారుల నివేదికల ఆధారంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధికారులు మంథని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 11 మందిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) FIR No: 137 తేదీ  : 25/06/2026 ,సెక్షన్లు

318(4),316(4),316(5),338,61(2)  కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో ట్యాబ్ ఆపరేటర్ నకిలీ ట్రక్ చిట్లు సృష్టించడం, కొనుగోలు రికార్డుల్లో అక్రమ నమోదులు చేయడం, స్టాఫ్ అసిస్టెంట్ అక్రమ ధాన్యం రవాణాకు సహకరించడం, కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి ప్రమేయంతో కుట్రపూరితంగా వ్యవహరించినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న 11 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు, దర్యాప్తులో మరెవరి ప్రమేయం వెలుగులోకి వచ్చినా వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తనిఖీల్లో మూడు లారీల్లో తరలిస్తున్న 2,213 బస్తాల (885.20 క్వింటాళ్లు) ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ఎనిమిది నకిలీ ట్రక్ చిట్ల ద్వారా 5,421 బస్తాల (2,168.40 క్వింటాళ్లు) ధాన్యాన్ని కొనుగోలు రికార్డుల్లో అక్రమంగా నమోదు చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు పేర్కొన్నారు.

రైతుల శ్రమను దోపిడీ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించేలా అన్ని కొనుగోలు కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని, అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు శాఖాపరమైన చర్యలు కూడా తప్పవని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆ ప్రకటనలో తెలిపారు.