ప్రతినెలా రోజ్ గార్ మేళా: కిషన్ రెడ్డి
హైదరాబాద్: గతేడాది నుంచి మిషన్ మోడ్ లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర విభాగాల్లో ఖాళీలు ఉండకూడదనే ప్రతినెలా రోజ్ గార్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 9 లక్షల మందికి నియామక పత్రాలు అందించామన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 51 మందికి నియామక పత్రాలు ఇస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. దిగుమతులు తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని వెల్లడించారు.
భారత్ ను ఉత్పత్తుల తయారీ హబ్ గా తయారుచేస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రక్షణ శాఖ పరికరాలను ఎక్కువగా దేశంలోనే తయారు చేస్తున్నామన్నారు. ఇతర దేశాలకు రక్షణ పరికరాలు, సెల్ ఫోన్లు ఎగుమతి చేస్తున్నామని, ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరాలనేదే తమ లక్ష్యమన్నారు. ఉగ్రవాద చర్యలు, అశాంతి వాతావరణంతో పెట్టుబడులు రావని స్పష్టం చేశారు. ఉగ్ర చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి తెలిపారు. పదేళ్లలో జమ్మూకశ్మీర్ మినహా ఎక్కడా బాంబుపేలుళ్లు జరగలేదని వెల్లడించారు. ప్రపంచంలోని ఏ దేశంలో చూసిన యువత సంఖ్య తగ్గుతోందన్నారు. మనదేశంలో యువత ఎక్కువగా ఉంది.. వారి శక్తి వాడుకోవాలి.. ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలను మరిచిపోకూడదని సూచించారు.




