6 June, 2026 | 1:42 AM

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

06-06-2026 12:18 AM

కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ జూన్ 5 ( విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు.  ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక‘ పర్యావరణ వారోత్సవాలు, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలు శుక్రవారం మామడ మండలం ఆరేపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులందరికీ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి బాధ్యత అని తెలిపారు. పర్యావరణ కాలుష్యం కారణంగా నేడు పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణ పరిస్థితుల్లో ప్రమాదకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. పుట్టినరోజు నాడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వివరించారు.

రైతులు పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల కూడా పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని తెలిపారు. రైతులు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టవద్దని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అనేది తమ తమ ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలని అన్నారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్, ఇతర అధికారులు మొక్కలను నాటారు.  కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అటవీ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే, సీనియర్ సివిల్ జడ్జి రవీందర్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎఫ్డిఓ నాగిని బాను, ఇతర అధికారులు, గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.